TS HIGH COURT: తెలుగులో తొలి తీర్పు వెలువరించిన తెలంగాణ హైకోర్టు

TS HIGH COURT: తెలుగులో తొలి తీర్పు వెలువరించిన తెలంగాణ హైకోర్టు
స్థానిక భాషల్లో కేరళ తరువాత తీర్పు వెలువరించింది తెలంగాణ హైకోర్టు మాత్రమే.

తెలుగులో తొలి తీర్పు వెలువరించిన తెలంగాణ హైకోర్టు చరిత్ర సృష్టించింది. తల్లి ఆస్తిలో వాటాకు సంబంధించి దాఖలైన అప్పీలుపై సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ పి.నవీన్‌రావు, జస్టిస్‌ నగేష్‌ భీమపాకలతో కూడిన ధర్మాసనం ఇటీవల తెలుగులో 44 పేజీల తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో మొత్తం ఇంగ్లీష్‌లోనే వ్యవహారాలుంటాయి. పిటిషన్‌లు దాఖలు చేసినప్పుడు అనుబంధ పత్రాలు, ఆధారాలు స్థానిక భాషలో ఉన్నప్పటికీ వాటిని ఆంగ్లంలోకి తర్జుమా చేసి కోర్టు రిజిస్ట్రీకి సమర్పించాలి. స్థానిక భాషల ప్రాధాన్యం పెరుగుతున్న దృష్ట్యా కోర్టులు కూడా మాతృభాష వైపు అడుగులు వేయడం ప్రారంభించాయి. సుప్రీం కోర్టు కీలక తీర్పులను ఈ మధ్య స్థానిక భాషల్లోకి తర్జుమా చేయిస్తోంది. ఈ నేపథ్యంలో హైకోర్టులు కూడా స్థానిక భాషలో తీర్పు వెలువరించడానికి ఆసక్తి చూపుతున్నాయి. స్థానిక భాషల్లో కేరళ తరువాత తీర్పు వెలువరించింది తెలంగాణ హైకోర్టు మాత్రమే. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేరళ హైకోర్టు మలయాళంలో తీర్పు వెలువరించింది. ఉభయ రాష్ట్రాల్లో కింది కోర్టుల్లో ఒకరిద్దరు మినహా తెలుగులో తీర్పులు వెలువరించిన సంఘటనలు అరుదే.

తెలుగులో తీర్పు వెలువరించడం ద్వారా జస్టిస్‌ పి.నవీన్‌రావు, జస్టిస్‌ నగేష్‌ భీమపాకలతో కూడిన ధర్మాసనం కొత్త అధ్యాయానికి నాంది పలికింది. కక్షిదారులు, ప్రజల సౌలభ్యం కోసం ఇలా తెలుగులో వెలువరించామని తీర్పు చివరిలో ధర్మాసనం పేర్కొంది. అధికారిక కార్యకలాపాల నిమిత్తం 41 పేజీల ఆంగ్ల తీర్పునూ వెలువరించింది.తెలుగులో ఏవైనా సందేహాలుంటే వాటి నివృత్తికి ఆంగ్లంలోని తీర్పును పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది.కేవలం ఈ కేసుకు సంబంధించిన అంశాలేకాకుండా తమ కేసును రుజువు చేసుకోవడానికి ఇరుపక్షాల న్యాయవాదులు సమర్పించిన సుప్రీం కోర్టు తీర్పులను ధర్మాసనం తెలుగులోకి అనువదించింది.తెలంగాణ హైకోర్టు మాతృభాషలో తీర్పు వెలువరించడం భాషాభిమానులకు ఆనందాన్ని ఇస్తోంది.భవిష్యత్తులో తెలుగులో మరిన్ని వెలువడటానికి ఇది మొదటి అడుగు కానుంది.

Tags

Read MoreRead Less
Next Story