MODI: బీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ ఒక్కటే: మోడీ

MODI: బీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ ఒక్కటే: మోడీ
కాళేశ్వరంలో కేసీఆర్‌ దోపిడీ చేశారన్న ప్రధాని... అవినీతి పార్టీలకు గుణపాఠం చెప్పాలని పిలుపు...

పోలింగ్‌ తేదీ సమీపిస్తున్న వేళ తెలంగాణలో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. అన్ని పార్టీల అగ్రనేతలు పూర్తిస్థాయిలో తెలంగాణపై దృష్టిసారించడం సహా సుడిగాలి పర్యటనలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కమలం పార్టీ తరఫున ప్రచారం చేస్తుండగా కాంగ్రెస్‌ అగ్రనేతలు ఖర్గే, రాహుల్‌, ప్రియాంకగాంధీ బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు.


బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఒకే తాను ముక్కలు అని విమర్శించిన ప్రధాని మోడీ ఆ రెండు పార్టీలు రాష్ట్రాభివృద్ధి కంటే తమ కుటుంబాల అభివృద్ధిపైనే దృష్టిపెడుతున్నాయని ప్రచార సభల్లో ఆరోపించారు. అగ్రనేతలతో బీజేపీ తెలంగాణలో ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసింది. బీజేపీ అధ్యక్షుడు నడ్డా హుజూర్‌నగర్‌ సభలో పాల్గొనడం సహా సికింద్రాబాద్‌, ముషీరాబాద్‌లో, రోడ్‌ షోలు నిర్వహించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వేములవాడ సభలో పాల్గొని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌పై విమర్శలు గుప్పించారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదాలను బీఆర్‌ఎస్‌ నెరవేర్చలేదని ఆరోపించారు. కొల్లాపూర్, మునుగోడు నియోజక వర్గాల్లో రోడ్ షో నిర్వహించిన కేంద్ర హోమంత్రి అమిత్ షా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, మియాపూర్ భూముల వేలం, ఔటర్ రింగ్ రోడ్డు లీజు, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో బీఆర్‌ఎస్‌ దోపిడీకి పాల్పడిందని ఆక్షేపించారు. బీజేపీ అధికారానికి రాగానే మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న కేంద్రమంత్రి వరికి క్వింటాల్ కు 3వేల 100 రూపాయలు చెల్లిస్తామని చెప్పారు. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గిస్తామని, ఆడపిల్లల పేరున రెండేసి లక్షలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ చేస్తామన్నారు. అంతకుముందు సోమాజిగూడలో మీడియా సమావేశంలో మాట్లాడిన షా బీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఉద్యోగాల భర్తీ సహా అనేక హామీలను తుంగలో తొక్కిందన్నారు. కామారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గాల్లో సభలకు హాజరైన ప్రధాని మోడీ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు.


కామారెడ్డి ప్రజలు ఈ రెండు పార్టీలనూ తిరస్కరించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ సీఎం, కాంగ్రెస్‌ తెలంగాణ అధ్యక్షుడు కామారెడ్డిలో పోటీ పడుతున్నారు. ఇతర స్థానాల్లోనూ పోరాడుతున్నారు. వీరు ఎంత ఆందోళన చెందుతున్నారో., ఎంతగా భయపడుతున్నారో దీని ద్వారా అర్థమవుతోందని మోడీ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కుటుంబ పాలన, అవినీతి, లాలూచీ రాజకీయాలకు చోటులేదని వారికి గుణపాఠం చెప్పండి. యువతను మోసం చేయడంలో బీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ ఒకే తరహాలో వ్యవరిస్తున్నాయని మోడీ ఆరోపించారు. తెలంగాణలో పొరపాటున కాంగ్రెస్‌కు అవకాశం ఇస్తే బీఆర్‌ఎస్‌ సర్కార్‌ మాదిరే అవినీతి ప్రభుత్వమే వస్తుందని మోదీ ఆరోపించారు. తన మాటే ఓ గ్యారెంటీ అన్న మోడీ... బీజేపీ అధికారంలోకి రాగానే బీసీని CM చేస్తామని స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story