మరో పదేళ్లు నేనే సీఎంగా ఉంటా : కేసీఆర్

మరో పదేళ్లు నేనే సీఎంగా ఉంటా : కేసీఆర్
ఇక సున్నితమైన అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయోద్దంటూ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు కేసీఆర్.

తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన రెండున్నర గంటల పాటు సాగిన కార్యవర్గ సమావేశం జరిగింది. గత కొంత కాలంగా కేటీఆర్ కు ముఖ్యమంత్రి పదవి దక్కుతుందన్న ప్రచారానికి తాత్కాలికంగా సీఎం కేసీఆర్ ఫల్‌స్టాప్‌ పెట్టారు . కొందరు నేతలు ఫిబ్రవరిలోనే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని చేస్తున్న ప్రచారానికి కేసిఆర్ వ్యాఖ్యలతో చెక్ పడింది. తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని మరో పదేళ్ల పాటు తానే సీఎం అని కార్యవర్గ సభ్యులకు చెప్పారు కేసీఆర్‌. అసెంబ్లీ వేదికగా ఇదే అంశాన్ని చెప్పానని... ఎవరు పడితే వాళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడొద్దని స్పష్టం చేశారు. తాను ఢిల్లీ వెళితే సీఎం మార్పు ఉంటుందని కూడా నేతలకు క్లారిటీ ఇచ్చారు. సీఎం మార్పుపై ఇకపై ఎవరూ మాట్లాడొద్దని వార్నింగ్ ఇచ్చారు గులాబీ బాస్. దీంతో ఢిల్లీ రాజకీయాల వైపు కూడా ఇప్పట్లో వెళ్లరనే సంకేతాలు కూడా ఇచ్చారు సీఎం కేసీఆర్‌.

ఇక సున్నితమైన అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయోద్దంటూ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. బహిరంగసభలో , కుల సంఘాల మీటింగులో ఇష్టానుసారంగా మాట్లాడి పార్టీకి చేటు చేసే విధంగా ఉంటే సస్పెన్షన్ వేటు తప్పదని హెచ్చరించారు. పార్టీ విషయంలో కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని పలువురు కి వార్నింగ్ ఇచ్చారు. నేతలు నోరు జారితే ఇతర పార్టీలకు మేలు చేకూరుతుందని అది తెలుసుకోవాలని కేసీఆర్ సూచించారు.

జీహెచ్ఎంసి మేయర్ డిప్యూటీ మేయర్ అభ్యర్థులను అధిష్టానం ప్రకటిస్తుందని.. అందరూ మద్దతు తెలపాలని కార్యవర్గం సమావేశంలో స్పష్టం చేశారు. 11వ తేదీన ఉదయం మేయర్ డిప్యూటీ మేయర్ అభ్యర్థుల పేర్లతో సీల్డ్ కవర్ పంపిస్తామని కేసీఆర్ అన్నారు. ఎక్స్ అఫీషియో నెంబర్స్ కార్పొరేటర్లు కలిసి జీహెచ్ఎంసి కి వెళ్లి మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులను ఎన్నుకోవాలని కెసిఆర్ ఆదేశించారు.

ఇక నాగార్జునసాగర్ బై ఎలక్షన్ పై టీఆర్ఎస్ శ్రేణులకు అధినేత కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఉప ఎన్నికలు గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. అధిష్టానం ప్రకటించిన అభ్యర్థి గెలుపు కోసం అందరూ పని చేయాలని సూచించారు. అంతర్గత విభేదాలు లేకుండా ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాలని నేతలకు కేసీఆర్ ఆదేశించారు.

పార్టీ సభ్యత్వ నమోదు విషయంలో నేతలకు టార్గెట్ పెట్టారు. ఒక్కో ఎమ్మెల్యే 50 వేల మంది సభ్యత్వాన్ని చేర్చాలన్నారు కేసీఆర్. 65 లక్షల మందిని టిఆర్ఎస్ మెంబర్‌గా చేర్చాలని కేసీఆర్ అన్నారు. సభ్యత్వ నమోదు ఎక్కువ సంఖ్యలో చేస్తే పార్టీ సంస్థాగతంగా బలోపేతం అవుతుందని సూచించారు. త్వరలోనే రాష్ట్ర ,జిల్లా, మండల ,గ్రామ స్థాయి వరకు కమిటీల రూపకల్పన జరుగుతుందని హామీ ఇచ్చారు. త్వరలోనే అన్ని ఉమ్మడి జిల్లా పర్యటిస్తానని గులాబీ బాస్ హామీ ఇచ్చారు


Tags

Read MoreRead Less
Next Story