ఇండస్ట్రీ పెద్దలూ మీరెక్కడ ..?

ఇండస్ట్రీ పెద్దలూ మీరెక్కడ ..?

సినిమాలో ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే.. హీరో వస్తాడు అనే నమ్మకం ప్రేక్షకులది. అలా వస్తేనే అతన్ని హీరో అంటారు. అలా కాకుండా ప్రాబ్లమ్ క్లియర్ అయిన తర్వాత వచ్చి నేనే హీరో అంటే మాత్రం ఎవరూ పట్టించుకోరు. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో ఇలాగే జరుగుతోంది. సమస్య ఉన్నప్పుడు ఒక్కరు కూడా ముందుకు వచ్చి దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేయరు. బట్ ఏ ఇబ్బందీ లేనప్పుడు మాత్రం ఇండస్ట్రీకి మేమే పెద్ద అనే రేంజ్ లో బిల్డప్స్ ఇస్తుంటారు. సినిమా ఆరంభం నుంచీ నేటి వరకూ డిస్ట్యిబ్యూషన్ వ్యవస్థ అనేది పరిశ్రమకు వెన్నుముక లాంటిది. ఆ వెన్నుముకకు అనేక ఎముకలు కలిసి దాన్ని బలంగా నిలబెడతాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అతి కొద్దిమందే డిస్ట్రిబ్యూషన్ ను నిర్వహిస్తూ.. కొత్తవారు రాకుండా ఆధిపత్యం చెలాయిస్తూ.. ఆ వెన్నుముకనే బలహీన పరుస్తున్నారు. దీని ద్వారా వచ్చే సమస్యలేంటీ అనేది ఈ మధ్య కాలంలో వరుసగా చూస్తున్నాం.

రీసెంట్ గా ఆచార్య సినిమాకు సమస్యలు వచ్చినప్పుడు ఇండస్ట్రీ పెద్దలెవరూ రాలేదు. చివరికి చిరంజీవి, రామ్ చరణ్‌ లు తమ రెమ్యూనరేషన్ తగ్గించుకుని డిస్ట్రిబ్యూటర్స్ ను ఆదుకునే ప్రయత్నం చేశారు.


ఇప్పుడు తాజాగా పూరీ జగన్నాథ్ కు సైతం ఆ సమస్య వచ్చింది. ఏకంగా అతని ఇంటికే వెళ్లి ధర్నా చేస్తాం అని కొంతమంది మూకుమ్మడిగా దాదాపు దాడి చేసేలా ప్లాన్ చేసుకున్నారు. దీనికి సమాధానం ఇవ్వడానికి పూరీ జగన్నాథ్ కు అండగా ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఇలాంటివి చూసినప్పుడు సహజంగానే కొన్ని అనుమానాలు వస్తాయి. అవి నిజమే అనేలా ప్రస్తుతం నైజాం ఏరియాలో ఓ కొత్త డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను ముందుకు తెచ్చేందుకు కొందరు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. వీరే వెనక ఉండి పూరీ లాంటి వారిని బెదిరించేలా కొందరిని రెచ్చగొట్టారు అని బలంగా వినిపిస్తోంది.

సినిమా ఇస్తే మాకే ఇవ్వాలి.. వేరే వారికి ఇస్తే బావుండదు అనేలా "ఆ నలుగురూ" వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. ఆచార్య, లైగర్ సినిమాల వ్యవహారంలో ఈ నలుగురి పాత్రే కీలకం అంటున్నారు.

ఈ మధ్య కాలంలోనే నెల రోజుల పాటు సమ్మె చేసి ఏ సమస్య వచ్చినా మేముంటాం అంటూ చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు మాత్రం ఒక్కరూ ముందుకు రావడం లేదు. ఇండస్ట్రీకి మేమే పెద్దలం, ప్రముఖులం అని భావించే బ్యాచ్ అంతా సైలెంట్ అవడం చూస్తే వీరు మాటలకే తప్ప చేతలకు పనికిరారు అనేది తేలిపోయింది. నిజమైన నాయకులు ఇలాంటి సందర్భాల్లోనే బయటకు వస్తారు.

ఇలాంటి సమయంలో కూడా కామ్ గా ఉంటే ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ భవిష్యత్ ప్రమాదంలో పడుతుంది.

పరిశ్రమలో విపరీత ధోరణులకు ఆస్కారం ఇస్తుంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒక్కో ప్రాంతంపై గుత్తాధిపత్యం చెలాయిస్తూ.. కొత్తగా వచ్చే వారికి ఆస్కారం లేకుండా ఓ రకమైన నియంతృత్వ ధోరణిని చెలాయిస్తోన్న వాళ్లు ఎవరు అనేది పరిశ్రమలో అందరికీ తెలుసు. ఆ నలుగురే ఇదంతా చేయిస్తున్నారు అనే వాళ్లకు వీళ్లు త్వరలోనే సమాధానం చెప్పాల్సి ఉంటుందేమో.

ఇప్పటికైనా పెద్దలంతా మేల్కొని ఈ గుత్తాధిపత్యాన్ని తగ్గించుకుని ఇండస్ట్రీకివచ్చే కొత్తవారిని ప్రోత్సహిస్తేనే మీరు నాయకులు అవుతారు. అంతే కానీ అంతాబావున్నప్పుడు మేం నాయకులం అని బిల్డప్ ఇస్తే మీరు ఎప్పటికీ నాయకులు కాలేరు.

Tags

Read MoreRead Less
Next Story