అంతర్జాతీయం

ఆఫ్గన్ అమ్మాయిలం.. అస్సలు తక్కువ అంచనా వేయకండి

తాలిబన్ల అరాచకపాలన తెలిసి కూడా ఊపిరి పీల్చుకునే స్వేచ్ఛ ఉంటుందనే ఆశిస్తున్నారా.. ఆ మొండి ధైర్యం వెనుక ఎవరున్నారు..

ఆఫ్గన్ అమ్మాయిలం.. అస్సలు తక్కువ అంచనా వేయకండి
X

అఫ్గాన్‌లో సంక్షోభం.. తాలిబన్ల ఆక్రమణతో అందరూ దేశం విడిచి పారి పోతున్నారా.. కొందరు మాత్రం ఎందుకు అంత ధైర్యంగా అక్కడే ఉన్నారు. చావైనా బ్రతుకైనా తమ దేశంలోనే అని ఎందుకంటున్నారు. తాలిబన్ల అరాచకపాలన తెలిసి కూడా ఊపిరి పీల్చుకునే స్వేచ్ఛ ఉంటుందనే ఆశిస్తున్నారా.. ఆ మొండి ధైర్యం వెనుక ఎవరున్నారు.. వారి భద్రతకు భరోసానిస్తూ కొందరు మహిళలు గళం విప్పుతున్నారు.

శత్రువు అని భావిస్తున్న తాలిబన్లను ప్రశ్నిస్తున్నారు. మీరు వల్లిస్తున్న శాంతి వచనాలు మేం ఎలా అర్థం చేసుకోవాలి.. మా వాళ్లకు మీరే స్వయంగా తెలియజేయండి అని తాలిబన్ల చేతికి మైక్ అందిస్తున్నారు. ఇంటర్వ్యూ చేసి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో వివరిస్తున్నారు. వివిధ రంగాల్లో ఉన్న మహిళ చూపిస్తున్న తెగువ కొందరి ఆఫ్గన్లను ముందుకు నడిపిస్తుంది. ఇప్పుడు ప్రపంచం వారి గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటోంది. ఆ ధీర వనితల గురించి మనమూ తెలుసుకుందాం.

తాలిబన్లు మాత్రమే ప్రవేశ పెట్టిన షరియా చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో వాళ్లకి తెలిసినంతగా మరెవరికీ తెలియవేమో. ఎంత మంది ప్రాణాలు కోల్పోయారో తెలిసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. వారి అరాచక పాలన మళ్లీ చూడాల్సి వస్తుందని తెలిసి దేశం విడిచి పారిపోతున్నారు. తాలిబన్ల పాలనలో ఆడవాళ్లకు అన్నింటా ఆంక్షలే. ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటేనే భయం. అలాంటివి 'హసిబా అతక్‌పల్' ధైర్యంగా బయటకు రావడమే కాదు, ఆఫ్గన పరిస్థితిని ప్రపంచానికి తెలియజేస్తోంది.హసిబా.. టోలో అనే ఒక వార్తా సంస్థలో పని చేస్తోంది. ఇది కాబూల్‌కు చెందిన ప్రధాన వార్తా సంస్థ. తాలిబన్లు తమ దేశంలో కాలు పెట్టారని తెలిసిన మరుక్షణం నుంచే ధైర్యంగా కెమెరా ముందుకు వచ్చి పరిస్థితిని వివరిస్తోంది. ఆమె వృత్తి ధర్మాన్ని మెచ్చుకుంటూ జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు పోస్టులు పెడుతున్నారు. మీ కార్యకలాపాలకు మేము ఎలాంటి హానీ కలిగించము అని తాలిబన్లు హామీ ఇచ్చిన తరువాత మహిళా జర్నలిస్టులు విధుల్లోకి తిరిగి చేరుతున్నారు. తాలిబన్ల మధ్య నిలబడి వార్తలు సేకరిస్తున్నారు.. ఇంటర్వ్యూలు చేస్తున్నారు. వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. ఇంకొందరు మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి ఇన్నేళ్లుగా మేం సాధించుకున్న విజయాలు, హక్కులు వృధాగా పోకూడదు అని బహిరంగంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు.ఆఫ్ఘనిస్తాన్‌లో మొట్టమొదటి మహిళా గవర్నర్‌లలో ఒకరైన 'సలీమా మజారీ' తాలిబన్‌లతో పోరాడటానికి ఆయుధాలు చేపట్టింది. ఇరాన్‌లో శరణార్థిగా పుట్టి పెరిగిన ఆమె అఫ్గాన్ జాతీయురాలు. సోవియట్ యుద్దం తరువాత ఆమె కుటుంబం దేశం విడిచి వెళ్లిపోయింది. తొమ్మిదేళ్ల క్రితం భర్త, పిల్లలతో కలిసి సొంతగడ్డపై అడుగు పెట్టింది. బల్క్ ప్రావిన్స్ జిల్లాలోని చాహర్‌కింట్ జిల్లా గవర్నర్‌గా పని చేస్తున్న సలీమా తొలి మహిళా గవర్నర్ కూడా కావడం విశేషం.

తాలిబన్లు దేశాన్ని ఆక్రమిస్తున్నారని తెలిసి కూడా ప్రజల మధ్య తిరిగింది. ముష్కరుల చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు వ్యూహాలు పన్నింది. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించింది. తాలిబన్లు ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించుకుంటున్నారని తెలిసి తమ సైన్యాన్ని వారితో పోరాటానికి సిద్ధం చేసింది. చుట్టుపక్కల అన్ని జిల్లాలు తాలిబన్ల వశమైనా చాహర్ జిల్లాను చేజిక్కించుకోటానకి తాలిబన్లు ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. ఇందుకు సలీమా చూపించిన తెగువే కారణం. కానీ ఆమె పోరాటం విఫలమై చాఫర్ జిల్లా తాలిబన్ల పాదాక్రాంతమైంది. అయితే సలీమా చూపించిన తెగువకు ఆఫ్గన్లు జేజేలు పలుకుతున్నారు.యల్దా హకీం.. బీబీసీలో జర్నలిస్టుగా పని చేస్తోంది. ఆమె లైవ్‌లో ఇంటర్వ్యూ చేస్తుండగా ఓ ఫోన్ వచ్చింది. తాలిబన్ ప్రతినిధి సుహైల్ షాహిన్ మాట్లాడుతున్నారు. యల్దా మొదట షాక్‌కి గురైనా వెంటనే తేరుకుని ఫోన్‌ని లైడ్ స్పీకర్‌లో ఉంచింది. ఆఫ్గాన్‌లో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించబోమని అతడి సందేశం అందరికీ చేరింది. మరికొన్ని ప్రశ్నలు అతడిపై సంధించింది. దాదాపు 30 నిమిషాలు అతడిని ఇంటర్వ్యూ చేసింది. తాలిబన్ల పాలనలో శిక్షల అమలు, మహిళల వస్త్రధారణ, విద్య మొదలైన అన్ని అంశాలను ప్రస్తావించింది. భయం గుప్పిట్లో ఉన్న ఆఫ్గన్లకు ఆమె మాటలు.. అతడితో చేసిన ఇంటర్వ్యూ ధైర్యాన్నిచ్చాయి. యల్దాపై ప్రశంసల వర్షం కురిసింది. 38 ఏళ్ల యల్దాకు ఇంగ్లీష్, హిందీ, పర్షియన్, ఉర్దూలో పట్టు ఉంది. గతంలో ఆఫ్గన్ అధ్యక్షుడినీ ఇంటర్వ్యూ చేసింది.

Next Story

RELATED STORIES