ఏపీ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం

ఏపీ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం
జాయింట్ డైరెక్టర్‌ జీవీ సాయిప్రసాద్‌ను తణక్షం ఉద్యోగం నుంచి తొలగిస్తూ SEC నిమ్మగడ్డ రమేష్‌ ఆదేశాలు జారీ చేశారు.

ఏపీ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. జాయింట్ డైరెక్టర్‌ జీవీ సాయిప్రసాద్‌ను తణక్షం ఉద్యోగం నుంచి తొలగిస్తూ SEC నిమ్మగడ్డ రమేష్‌ ఆదేశాలు జారీ చేశారు. సాయిప్రసాద్‌ 30 రోజులు సెలవుపై వెళ్లడమే కాకుండా..ఇతర ఉద్యోగుల్ని కూడా సెలవుపై వెళ్లాలని ప్రభావితం చేస్తున్నారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దీన్ని తీవ్రంగా పరిగణించినట్టు ఆయన తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ క్రమశిక్షణారాహిత్యాన్ని, ధిక్కార స్వరాన్ని ఉపేక్షించబోమని చెప్తూ ఆయన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. ఆర్టికల్ 243 రెడ్‌విత్‌, ఆర్టికల్ 324 ప్రకారం సాయిప్రసాద్‌ను వెంటనే విధుల నుంచి తొలగిస్తున్నట్టు స్పష్టం చేశారు.

సాయిప్రసాద్‌ వేరే ఇతర ప్రభుత్వ సర్వీసుల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా చేరడానికి వీల్లేదని కూడా నిమ్మగడ్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. అలాగే ఎలాంటి టెర్మినల్ బెనిఫిట్స్‌కు ఆయన అర్హులు కాదన్నారు. SECలో జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న వ్యక్తిని తప్పించడం, ఆయనకు ఉద్వాసన పలకడం వంటివి ఇప్పుడు సంచలనంగా మారాయి. ఎన్నికల నియమావళికి, రాజ్యాంగానికి కట్టుబడి ఉండాల్సిన జాయింట్ డైరెక్టర్‌ సాయిప్రసాద్ ఇలా ఉల్లంఘనలకు పాల్పడడం సీరియస్‌గా తీసుకున్నామని నిమ్మగడ్డ లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక ఇలా వ్యహరించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు చెప్పారు.

ఈనెల 9వ తేదీన పంచాయతీ ఎన్నికలపై నోటిఫికేషన్ ఇచ్చింది SEC. ఏతే.. దానికి ముందే కమిషన్ ఉద్యోగులు అందరూ కూడా అందుబాటులో ఉండాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ ఆదేశించారు. సెక్రటరీ, సీనియర్ ఉద్యోగులంతా ప్రధానకార్యాలయంలో అందుబాటులో ఉండాలని కోరారు. ఐతే.. ఎవరికీ చెప్పకుండా జీవీ సాయి ప్రసాద్‌ 30 రోజులు లీవ్ రాసి వెళ్లారు. పంచాయతీ ఎన్నికలకు విఘాతం కలిగేలా ఇతర ఉద్యోగుల్ని సైతం మభ్యపెట్టి వాళ్లను కూడా 30 రోజులు సెలవుపై వెళ్లాలంటూ ఒత్తిడి తెచ్చారని నిమ్మగడ్డ తన లేఖలో పేర్కొన్నారు. ఈ విషయం తమ దృష్టికి రాగానే విచారణ జరిపిన తర్వాత జీవీ సాయిప్రసాద్ పాత్ర నిర్థారణ అయ్యిందని అందుకే చర్యలకు ఆదేశించినట్టు నిమ్మగడ్డ స్పష్టం చేశారు. జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న వ్యక్తి ఈ క్రమశిక్షణారాహిత్య పనులన్నీ తన ఛాంబర్ నుంచే చేశారని, దీన్ని తీవ్రంగా పరిగణించే చర్యలు తీసుకున్నట్టు నిమ్మగడ్డ పేర్కొన్నారు.

ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం నుంచి, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవడం, ఇప్పుడీ అంశం హైకోర్టు వరకూ వెళ్లిన నేపథ్యంలో తాజా పరిణామాలు పెను సంచలనం రేపుతున్నాయి. SECలో కీలక స్థానంలో ఉన్న జాయింట్ డైరెక్టర్‌ జీవీ సాయిప్రసాద్ ఉన్నట్టుండి 30 రోజులు సెలవులో ఎందుకు వెళ్లాలనుకున్నారనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ప్రక్రియ సజావుగా పూర్తి చేయాలని SEC నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనుకుంటుంటే ఇలాంటి పరిణామాలు ఎందుకు జరుగుతున్నాయి అనేది హాట్ టాపిక్ అయ్యింది. ప్రభుత్వ ఉద్యోగులపై కూడా ఒత్తిడి ఉందా, వారు కోర్టుకు వెళ్లడానికి కారణాలేంటి అనేదానిపై కూడా అంతా చర్చించుకుంటున్నారు. ఎన్నికల నిర్వహణపై స్టే ఇవ్వాలంటూ ప్రభుత్వం కోర్టుకు వెళ్లడం, ప్రభుత్వ ఉద్యోగుల సంఘంతోపాటు ఉపాధ్యాయుల సంఘం కూడా ఈ పిటిషన్‌లో ఇంప్లీడ్ అవుతుండడం లాంటి పరిణామాలన్నీ ఇప్పుడు కీలకంగా మారాయి. మొత్తంగా SECలో జేడీగా ఉన్న సాయిప్రసాద్‌కు ఉధ్వాసన పలకడం, ఇటు కోర్టులో విచారణ జరుగుతుండండతో ఎన్నికలపై నెక్స్ట్ ఏమవుతుందనేది ఉత్కంఠ రేపుతోంది.



Tags

Read MoreRead Less
Next Story