Air India: ఎయిర్ ఇండియా విమానాలకు భద్రతను పెంచాలన్న భారత్..

Air India: ఎయిర్ ఇండియా  విమానాలకు భద్రతను పెంచాలన్న భారత్..
ఖలిస్థానీల బెదిరింపులతో విమానాశ్రయాల్లో తనిఖీలు

ఖలిస్తాన్ అనుకూల సిక్కుల ఫర్ జస్టిస్ గ్రూప్ బెదిరింపుల మధ్య ఎయిరిండియావిమానాలకు భద్రతను పెంచాలని భారత అధికారులు కెనడాను కోరారు. వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ పన్నూన్ నవంబర్ 19 తర్వాత భారతీయ క్యారియర్‌తో ప్రయాణించకుండా ఉండాలని ప్రజలను బెదరించడంతో భద్రత పెంచాల్సిందిగా సూచించారు.దీంతో ఎయిరిండియా విమానాలలో అదనపు భద్రతా తనిఖీలను నిర్వహించాలని బీసీఏఎస్‌ ఆదేశించింది. ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థ ఎస్‌ఎఫ్‌జే బెదిరింపుల నేపథ్యంలో పంజాబ్‌, న్యూఢిల్లీలలోని విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది.

నవంబరు 19వ తేదీన ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించే వారికి ప్రమాదం తప్పదని ఖలిస్థాన్ వేర్పాటు వాది గురుపత్వంత్ సింగ్ (సిఖ్ ఫర్ జస్టిస్ సహ వ్యవస్థాపకుడు) హెచ్చరించడం పట్ల భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. నవంబరు 19న సిక్కులెవరూ ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించవద్దని, ఆ రోజున ప్రతి చోటా ఎయిరిండియా విమానాలను అడ్డుకుంటామని గురుపత్వంత్ సింగ్ స్పష్టం చేశాడు. అంతేకాదు, ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కూడా మూతపడుతుందని, ఆ విమానాశ్రయం పేరు మార్చేస్తామని ఓ వీడియోలో పేర్కొన్నాడు.


ఇదంతా ఒకెత్తయితే, నవంబరు 19న అహ్మదాబాద్ లో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుందన్న మాట గురుపత్వంత్ నోటి వెంట రావడం భారత కేంద్ర ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేసింది. వెంటనే ఈ విషయాన్ని కెనడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఎయిరిండియా విమానాలకు భద్రత కల్పించాలని కోరింది.దీనిపై కెనడాలో భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ వివరాలు తెలిపారు. కెనడా-భారత్ మధ్య నడిచే ఎయిరిండియా విమానాలకు అదనపు భద్రత కల్పించాలని కెనడా ప్రభుత్వాన్ని కోరామని, సంప్రదింపులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

ఈ క్రమంలో భారత్ దిల్లీ, పంజాబ్ విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. దిల్లీ విమానాశ్రయంలో సందర్శకులకు ఎయిర్పోర్టు ఎంట్రీ పాస్ జారీని నిలిపివేయాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(BCAS) ఆదేశించినట్లు సమాచారం.

బీసీఏఎస్ సోమవారం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం.. ఈ రెండు విమానాశ్రయాల నుంచి ఎయిరిండియా విమానాల్లో వెళ్లే ప్రయాణికుల అదనపు తనిఖీలు ఉండనున్నాయి. అలాగే దిల్లీ విమానాశ్రయంలో సందర్శకులకు ఎంట్రీ పాస్ల జారీని, ఎంట్రీ టికెట్ల అమ్మకాన్ని నిషేధించనున్నారు. నవంబర్ 30 వరకు ఈ అదనపు భద్రతా ఏర్పాట్లు అమల్లో ఉండనున్నాయి. దర్యాప్తు సంస్థలను నుంచి వస్తోన్న హెచ్చరికల దృష్ట్యా ఈ ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు బీసీఏఎస్ పేర్కొంది. ఈ పరిణామాల మధ్య ఎయిరిండియా నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.

Tags

Read MoreRead Less
Next Story