కరోనా స్ట్రెయిన్‌తో మళ్లీ లాక్‌డౌన్‌ బాట పడుతున్న పలు దేశాలు

కరోనా స్ట్రెయిన్‌తో మళ్లీ లాక్‌డౌన్‌ బాట పడుతున్న పలు దేశాలు
బ్రిటన్‌లో మొదలైన స్ట్రెయిన్‌.. అనేక దేశాలకు పాకడంతో కొన్ని దేశాలు మళ్లీ లాక్‌డౌన్‌ బాట పడుతున్నాయి.

కరోనా వైరస్‌ కొత్త స్ట్రెయిన్‌తో ప్రపంచ దేశాలు వణుకుతున్నాయి. బ్రిటన్‌లో మొదలైన స్ట్రెయిన్‌.. అనేక దేశాలకు పాకడంతో కొన్ని దేశాలు మళ్లీ లాక్‌డౌన్‌ బాట పడుతున్నాయి. బ్రిటన్‌లో ఫిబ్రవరి నెల మధ్య వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ప్రకటించారు. స్కూళ్లు, షాపింగ్ మాల్స్ మూసివేయాలన్నారు. ప్రజలు ఇంటికే పరిమితం కావాలని, నిత్యావసరాల కోసమే బయటకు రావాలని కోరారు. బ్రిటన్‌లో వరుసగా ఏడో రోజు కూడా 50 వేలకుపైనే స్ట్రెయిన్‌ కేసులు బయటపడ్డాయి.

స్కాట్లాండ్‌లో నిన్నటి నుంచి లాక్‌డౌన్‌ అమలు చేశారు. కరోనా స్ట్రెయిన్‌ నేపథ్యంలో 5 వారాలపాటు పాక్షిక లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు నెదర్లాండ్స్‌ ప్రకటించింది.

జర్మనీలోనూ కరోనా వైరస్‌ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. జర్మనీలో గడచిన 24 గంటల్లో 944 మంది కరోనాతో చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఈ నెలాఖరు వరకు కఠిన లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు జర్మనీ చాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌ ప్రకటించారు. ప్రజలు అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచించారు. బ్రిటన్‌ నుంచి వచ్చే విమానాలపై నిషేధాన్ని పొడిగించారు. రైలు, బస్సు, ఓడ మార్గాలను కూడా మూసివేశారు.

కరోనా వైరస్‌ వ్యాప్తిస్తుండడంతో లాక్‌డౌన్‌ నిబంధనలు తప్పకుండా పాటిస్తామని కొత్తగా ఏర్పాటైన గ్రీస్‌ కేబినెట్‌ ప్రమాణం చేసింది. 2 నెలలుగా అమలవుతున్న లాక్‌డౌన్‌ను గ్రీస్‌ పొడిగించింది.

చైనాలోనూ కరోనా కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 33 మందికి కరోనా సోకింది. బీజింగ్‌ సమీపంలోని హెబీ ప్రావిన్స్‌లో 14 కేసులు బయట పడడంతో ఆ ప్రాంతాన్ని ప్రభుత్వం డేంజర్‌ జోన్‌గా ప్రకటించింది. కొత్త కేసుల్లో 11 షిజిజువాంగ్‌ నగరంలోనే ఉన్నాయి. లక్షణాలు కనిపించకుండా మరో 30 కేసులు బయటపడినట్టు అధికారులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story