Canada: భారత్ తో బంధం ముఖ్యమే కానీ...

Canada: భారత్ తో బంధం ముఖ్యమే కానీ...
నిజ్జర్ హత్యపై స్పందించిన కెనడా రక్షణ మంత్రి

ప్రస్తుతం కెనడా- భారత్ మధ్య వివాదం పెద్దదవుతున్న వేళ ఆ దేశ రక్షణ మంత్రి బిల్ బ్లెయిర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో తమ సంబంధాలు ముఖ్యమైనవిగా పేర్కొన్న ఆయన.. నిజ్జర్ హత్య ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. సిక్కు వేర్పాటువాది నిజ్జర్ హత్య విషయంలో భారత్ హస్తముందని కెనడా ప్రధాని ట్రూడో ఆరోపణలు చేయడంతో ఈ వివాదం మొదలైన విషయం తెలిసిందే. దీంతో భారత్ కెనడా సంబంధాలు దెబ్బతిన్నట్లు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలపై అగ్రరాజ్యం అమెరికాతో సహా ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఖలిస్తానీ టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై బ్లెయిర్ తొలిసారిగా స్పందించారు. ‘భారత్‌తో మా సంబంధాలకు ఇది సవాల్‌తో కూడుకున్న సమస్య అని మేము అర్థం చేసుకున్నాం.. అది నిరూపితమయ్యింది కూడా .. అయితే అదే సమయంలో సమగ్ర దర్యాప్తును నిర్వహించి, నిజాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత మాకు ఉంది.. ఒకవేళ ఆరోపణలు నిజమని రుజువైతే కెనడా మన సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించే విషయంలో చాలా ముఖ్యమైన ఆందోళన కలిగిస్తుంది’ రక్షణ మంత్రి బిల్ బ్లెయిర్‌ను ఉటంకిస్తూ గ్లోబల్ న్యూస్ పేర్కొంది.


ఇదే సమయంలో కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాద కార్యకలాపాలపై చర్యలు తీసుకోకపోవడానికి తమ పార్టీదే బాధ్యత అని కెనడా అధికార లిబరల్ పార్టీ ఎంపీ చంద్ర ఆర్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదుల బెదిరింపులతో కెనడా హిందువుల్లో భయం నెలకొందని భారత సంతతి సభ్యుడు చంద్ర ఆర్య స్పష్టం చేశారు. జస్టిన్‌ ట్రూడో పార్టీకి చెందిన ఆర్య.. తాజాగా నెలకొన్న పరిస్థితుల్లో హిందూ కెనడియన్లు సంయమనంతో ఉండాలని మరోసారి విజ్ఞ‌ప్తి చేశారు.

భారత్ పై బహిరంగంగా ఆరోపణలు చేయడానికి ముందు కెనడా ప్రధాని వద్ద విశ్వసనీయ సమాచారం ఉందని అమెరికా దౌత్యాధికారి డేవిడ్ కోహెన్ పేర్కొన్నారు. ‘ఫైవ్ ఐస్’ భాగస్వామ్య దేశాల నుంచి ఆయనకు సమాచారం అందిందని, ఆ తర్వాతే ట్రూడో ఈ సంచలన ఆరోపణలు చేశారని వివరించారు. దీనికి సంబంధించిన ఆధారాలను భారత్ కు చాలా వారాల క్రితమే అందించామని ట్రూడో చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. అయితే, ఈ ఆరోపణలను భారత ప్రభుత్వం కొట్టిపారేసింది. నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల పాత్రపై కెనడా నుంచి ఎలాంటి ఆధారాలు అందలేదని స్పష్టం చేసింది. రాజకీయ ప్రేరేపిత విద్వేష నేరాలు ఆ దేశంలో సర్వసాధారణమేనని విదేశాంగ శాఖ విమర్శించింది.

Tags

Read MoreRead Less
Next Story