China: బుద్ధి చూపించిన చైనా..కొత్త మ్యాప్ విడుదల

China: బుద్ధి చూపించిన చైనా..కొత్త మ్యాప్ విడుదల
అరుణాచల్ ను తమ అంతర్భాగంగా చూపిస్తూ మ్యాప్

చైనా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. మరోసారి తన వక్రబుద్ధిని చాటుకున్నది. భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్ భూభాగాలను తమ అంతర్భాగంగా చూపిస్తూ కొత్త స్టాండర్డ్‌ మ్యాప్‌ను విడుదల చేసింది. చైనా సహజ వనరుల శాఖ ‘2023 ఎడిషన్‌ ఆఫ్‌ ద స్టాండర్డ్‌ మ్యాప్‌ ఆఫ్‌ చైనా’ పేరుతో ఈ మ్యాపుల్ని రూపొందించింది. డిజిటల్‌, నావిగేషన్‌ మ్యాపుల్ని కూడా విడుదల చేస్తున్నట్టు డ్రాగన్ అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. భారత భూభాగాలతో పాటు తైవాన్ ను, సౌత్ చైనా సముద్రాన్నీ మ్యాప్ లో పొందుపరిచింది. చైనా సరిహద్దులు.. అందులో భూభాగాల్ని తెలుపుతూ ఈ మ్యాపుల్ని రూపొందించగా.. భారత్‌లోని అరుణాచల్‌ ప్రదేశ్‌, అక్సాయిచిన్‌ ప్రాంతాల్ని తమ భూభాగాలుగా చూపింది. ఈ మ్యాప్‌లో అరుణాచల్‌ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌గా పేర్కొంది. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని 11 ప్రాంతాల పేర్లను ప్రామాణీకరిస్తూ మ్యాపును రూపొందించడం గమనార్హం. 1962 లో కశ్మీర్‌లో భాగంగా ఉన్న అక్సాయ్‌ చిన్‌ను డ్రాగన్‌ దేశం ఆక్రమించుకున్నది. అప్పటి నుంచి ఈ భూభాగంపై భారత్‌, చైనాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది.


అరుణాచల్‌లోని ప్రాంతాలకు చైనా పేర్లు సూచిస్తూ ఈవిధంగా డ్రాగన్ మ్యాపులు విడుదల చేయటం ఇది మూడోసారి. ఈ ఏడాది ఏప్రిల్‌లో అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 ప్రాంతాల పేర్లను చైనీస్, టిబెటన్, పిన్‌యున్ భాషల్లో చైనా సివిల్ ఎఫైర్స్ మినిస్ట్రీ ఆమోదించింది. మొదటిసారి 2017లో చైనా ఆరు ప్రాంతాల పేర్లు మార్చింది. ఆ తర్వాత 2021 డిసెంబరులో మరో 21 ప్రదేశాలకు కొత్త పేర్లు పెట్టింది. ఈ పేర్లు మార్చడాన్ని చైనా తన వాదనలకు మరింత బలం చేకూర్చే ప్రయత్నంగా భావిస్తున్నారు. అయితే, అరుణాచల్ ప్రదేశ్‌ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమని కేంద్రం పలుసార్లు స్ఫష్టం చేసింది.


తైవాన్ తమ భూభాగమేనని చైనా వాదిస్తోంది. ఈ విషయంలో ఇటీవల ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. తైవాన్ ద్వీపం చుట్టూ ఇటీవల నేవీ షిప్ లతో చైనా డ్రిల్స్ నిర్వహించింది. మరోవైపు, దక్షిణ చైనా సముద్రంలో అతిపెద్ద భాగంగా ఉన్న నైన్‌ డ్యాష్‌ లైన్‌ను కూడా చైనా తమ ప్రాంతంగా చూపించుకున్నది. కానీ సౌత్ చైనా సముద్రంలో తమకూ వాటా ఉందంటూ వియత్నాం, ఫిలిప్పీన్, మలేసియా, బ్రూనై, తైవాన్ వాదిస్తున్నాయి. అయితే, ఈ దేశాల వాదనలను చైనా ఎప్పటిలాగే తోసిపుచ్చుతూ.. తాజాగా మ్యాప్ విడుదల చేసింది.

Tags

Read MoreRead Less
Next Story