Russia-Ukraine war : ఉక్రెయిన్‌ డ్రోన్ లు - రష్యా యుద్ధనౌకల పాలిట యమపాశాలు

Russia-Ukraine war : ఉక్రెయిన్‌ డ్రోన్ లు - రష్యా యుద్ధనౌకల పాలిట యమపాశాలు
విధుల్లోకి నూతన మోడల్‌

సైనిక సంపత్తి పరంగా రష్యాతో పోల్చితే ఉక్రెయిన్‌ నామమాత్రమే. అయినా రష్యాతో పోరులో ఆ దేశం ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. అనతికాలంలోనే కొత్త ఆయుధాల రూపకల్పన, తయారీతో తన రక్షణ వ్యవస్థను ఉక్రెయిన్‌ పటిష్ఠంగా చేసుకుంటోంది. ఈ క్రమంలోనే సముద్ర డ్రోన్‌-సీ బేబీని రూపొందించింది. తాజాగా వాటిని అప్‌గ్రేడ్‌ చేస్తూ నూతన మోడల్‌ను విధుల్లోకి చేర్చింది. ఈ డ్రోన్లు ఇప్పటికే రష్యా యుద్ధనౌకల పాలిట యమపాశాలుగా మారాయి.

ముద్ర డ్రోన్‌-సీ బేబీలో నూతన మోడల్‌ను ఉక్రెయిన్‌ సెక్యూరిటీ సర్వీస్‌ ఆవిష్కరించింది. రష్యా యుద్ధనౌకల ధ్వంసమే లక్ష్యంగా ఈ అత్యాధునిక డ్రోన్లకు ఉక్రెయిన్‌ రూపకల్పన చేసింది. ఇప్పటి వరకు వీటిని బహిర్గతం చేయని కీవ్‌ తాజాగా వాటిని బయటపెట్టింది. ఈ సముద్ర డ్రోన్లను రష్యాకు చెందిన యుద్ధనౌకలు, గస్తీ నౌకలు, మైన్‌ స్వీపర్స్‌పై దాడులకు వినియోగిస్తున్నామని అధికారులు తెలిపారు. సీ బేబీలు టన్నుకుపైగా పేలుడు పదార్థాలను మోసుకెళ్లడంతో పాటు 90 కిలోమీటర్ల వేగంతో వెయ్యి కిలోమీటర్లకు పైగా ప్రయాణించగలవని ఉక్రెయిన్‌ స్టేట్‌ సెక్యూరిటీ సర్వీస్‌ అధికారులు వివరించారు. సముద్ర డ్రోన్ల ఉత్పత్తి కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిన మెుదటి దేశం తమదేనని ఉక్రెయిన్‌ చెబుతోంది. రష్యాతో రెండేళ్లకుపైగా సాగుతున్న సుదీర్ఘ యుద్ధం కారణంగా నూతన సైనిక సాంకేతికత అభివృద్ధికి ఉక్రెయిన్‌ ఒక ప్రయోగశాలగా మారిందని నిపుణులు చెబుతున్నారు. 21వ శతాబ్దపు యుద్ధ రంగంలో సముద్ర డ్రోన్లు వాడకం సాధారణమవుతుందని అభిప్రాయపడ్డారు.


ఈ అత్యాధునిక సీ డ్రోన్లతోనే నల్ల సముద్రంలో రష్య యుద్ధనౌకపై దాడి చేసి ముంచేశామని ఉక్రెయిన్‌ వెల్లడించింది. ఈ మేరకు వీడియోను విడుదల చేసింది. రష్యా అతిపెద్ద గస్తీ నౌక సెర్గేవ్‌ కొటోవ్‌ 60 మంది సిబ్బందితో పాటు క్రూజ్‌ క్షిపణులను మోసుకెళ్లగలదని వివరించింది. గత నెలలో కూడా రెండు నౌకలను ఇలాగే దాడి చేసి ముంచేశామని ఉక్రెయిన్‌ ప్రకటించింది. రష్యా, క్రిమియాను అనుసంధానించే కెర్చ్‌ వంతెనపై ఉక్రెయిన్‌ రెండు డ్రోన్లతో దాడి చేసిందని రష్యా గతేడాది జులైలో పేర్కొంది. కెర్చ్‌ వంతెనపై దాడికి కూడా సీ బేబీ డ్రోన్లనే కీవ్‌ వినియోగించి ఉంటుందని నిపుణులు అనుమానిస్తున్నారు. సీ బేబీ డ్రోన్ల డీజైన్‌, టెస్టింగ్‌ స్వదేశంలోనే చేపట్టినా కొన్ని పరికరాలను మాత్రం ఉక్రెయిన్‌ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంది. సీ బేబీ డ్రోన్లు ఒక్కొక్కటి 2 లక్షల 21 వేల డాలర్ల ఖరీదు ఉంటాయని తెలుస్తోంది. వీటి ద్వారా వందల మిలియన్ల డాలర్ల విలువైన నౌకలను ధ్వంసం చేయవచ్చు

Tags

Read MoreRead Less
Next Story