Russia: కుటుంబానికి చేరని నావల్నీ మృతదేహం , అధికారులపై మద్దతుదారుల ఆగ్రహం

Russia: కుటుంబానికి చేరని నావల్నీ మృతదేహం , అధికారులపై మద్దతుదారుల ఆగ్రహం
సంతాపం ప్రకటించినందుకు గాను 4 వందలమంది అరెస్ట్

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రత్యర్థి, విపక్ష నేత అలెక్సీ నావల్నీ మృతదేహాన్ని కావాలనే దాచి పెడుతున్నారని ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. పుతినే నావల్నీని చంపించినట్లు ఆయన అధికార ప్రతినిధి ఆరోపించారు. నావల్నీ మృతదేహాన్ని తీసుకోవడానికి ఆయన తల్లి లియుడ్నిలా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మరోవైపు నావల్నీకి నివాళులర్పించిన 230మందిని రష్యా పోలీసులు అరెస్టు చేశారు. నావల్నీ స్మారకాలను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.

రష్యా ప్రతిపక్ష ఉద్యమకారుడు అలెక్సీ నావల్నీ మృతదేహాన్ని తీసుకోవడానికి ఆయన తల్లి లియుడ్మిలా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆయన మరణవార్తను అధికారికంగా తెలిసిన వెంటనే ఆర్కిటిక్‌ పీనల్‌ కాలనీ జైలుకు ఆమె వెళ్లారు. కానీ, అప్పటికే మృతదేహాన్ని సమీపంలోని సలేఖార్డ్‌ నగరానికి తరలించినట్లు చెప్పారు. అక్కడ కూడా ఆమెకు నిరాశే ఎదురైంది. ప్రాథమిక శవపరీక్షలో ఎలాంటి ఫలితం తేలలేదని.. రెండోసారి చేయాల్సి ఉంటుందని అక్కడి అధికారులు చెప్పినట్లు నావల్నీ అధికార ప్రతినిధి కీరా యార్మిష్‌ వెల్లడించారు. నావల్నీ మృతదేహాన్ని కావాలనే దాచిపెడుతున్నారని ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. మరణానికి దారితీసిన అవశేషాలను శరీరంలో నుంచి తుడిచిపెట్టాలనే అలా చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు నావల్నీ ఆర్కిటిక్‌ పీనల్‌ కాలనీలో స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2 గంటల 17 నిమిషాలకు మరణించినట్లు ఆయన తల్లికి తెలియజేశారు. సడెన్‌ డెత్‌ సిండ్రోమ్‌ వల్లే మృతిచెందారని పేర్కొన్నారు. ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా గుండెపోటుతో ఆకస్మిక మరణానికి దారితీసే స్థితిని ఈ విధంగా వ్యవహరిస్తారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు నావల్నీ మృత దేహాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించబోమని రష్యా ఇన్వెస్టిగేటివ్‌ కమిటీ ఇప్పటికే స్పష్టం చేసింది..


నావల్నీని హత్య చేశారని ఆయన అధికార ప్రతినిధి కిరా యార్మిష్ ఆరోపించారు. ఆయన మృతదేహం ఎక్కడ ఉందో తెలియడం లేదన్నారు. కుటుంబ సభ్యులకు నావల్నీ మృతదేహాన్ని అప్పగించాలని డిమాండ్‌ చేశారు. మూడేళ్ల క్రితమే నావల్నీని పుతిన్‌ చంపడానికి యత్నించారని ఆరోపించారు. నావల్నీ మృతిపై ఇప్పటికే అమెరికా, యూకే, కెనడా సహా పలు దేశాలు తీవ్రంగా స్పందించాయి. దీని వెనుక అధ్యక్షుడు పుతిన్‌ హస్తం ఉందని ఆరోపించాయి.

మరోవైపు సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లోని నావల్నీ స్మారకాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. నావల్నీ మృతి తర్వాత ఆ స్మారకం వద్ద కొందరు ప్రజలు పూలు ఉంచి నివాళులు ఆర్పించారు. రష్యా వ్యాప్తంగా మరికొన్ని చోట్ల కూడా ప్రజలు ఇలా పూలతో నావల్నీకి నివాళులు ఆర్పించగా వాటిని కూడా గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. రష్యా వ్యాప్తంగా 21 నగరాల్లో నావల్నీకి నివాళులర్పించిన 230 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story