Israel-Hamas: గాజాలో తీవ్ర ఆహార కొరత

Israel-Hamas: గాజాలో తీవ్ర ఆహార కొరత
పశువుల దాణానే ఆహారంగా

5 నెలలుగా జరుగుతున్న యుద్ధంతో గాజాలో తీవ్రమైన ఆహార కొరత నెలకొంది. గతంలో పశువులకు పెట్టిన దాణానే ఇప్పుడు చాలా మంది గాజావాసులు ఆహారంగా తీసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. చాలా మందికి రోజుల తరబడి పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇసుకతో కూడిన ఆహారాన్ని తినాల్సి వస్తోంది. పోషకాహార లోపంతో అనేక మంది గాజా పౌరులు సతమతమవుతున్నారు.

ఇజ్రాయెల్‌ దాడుల కారణంగా గాజాలో అత్యంత దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆహార కొరతతో పాలస్తీనా పౌరులు అల్లాడుతున్నారు. ఆకలి నుంచి తప్పించుకోవడానికి గతంలో పశువులకు పెట్టిన దాణానే తాము ఆహారంగా స్వీకరించాల్సిన దుస్థితి గాజా వాసులకు తలెత్తింది. ఒకవైపు ఆహార కొరత, మరొకవైపు ఆకాశాన్నంటిన ధరల కారణంగా గాజా వాసులకు పిండి దొరకడమే గగనంగా మారింది. గాజా వాసుల్లో అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు. చాలా మందికి రోజుల తరబడి ఆహారం దొరకడం లేదు. గోధుమలను పిండిగా ఆడించడానికి మిల్లులకు చాలా తక్కువ మంది వస్తున్నారని మిల్లు యజమానులు వాపోతున్నారు. చాలా మంది గతంలో పశువులకు ఆహారంగా పెట్టే వాటినే తీసుకోస్తున్నారని తెలిపారు. వాటినే వారు ఆహారంగా తీసుకుంటున్నారని వెల్లడించారు.


గాజాలోకి వస్తున్న సహాయ సామగ్రి బాగా తగ్గిపోయింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఆహార నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి. ధరలు ఆకాశాన్నంటాయి. యుద్ధం మొదలుకాక ముందు కిలో పిండి 8 షెకెళ్లు ఉండగా ఇప్పుడు ఏకంగా 25 షెకెళ్లకు చేరింది. ఆహార సరఫరాలు క్లిష్టమైన స్థాయికి క్షీణించడంతో, గాజా స్ట్రిప్ కరువు అంచున కొట్టుమిట్టాడుతోంది. గాజా నగరంలో అనేక మంది ప్రజలు పోషకాహార లోపంతో సతమతమవుతున్నారు. గతంలో పశువులకు ఆహారంగా పెట్టిన వాటినే ఇప్పుడు తాము తింటున్నామని గాజా వాసులు వాపోతున్నారు. ఎన్నడూ ఇలాంటి పరిస్థితి తలెత్తలేదని తెలిపారు. కొన్నిసార్లు ఇసుకతో కూడిన ఆహారాన్నే తినాల్సి వస్తోందన్నారు. కానీ తమకు మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.


అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ మిలిటెంట్ల ఆకస్మిక దాడి తర్వాత యుద్ధం మొదలవగా ఇప్పటివరకు గాజాలో 28 వేల 176 మంది ప్రాణాలు కోల్పోయారు. 67 వేల మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్యలో వేలల్లో ఉండటంతో శ్మశానాల్లో స్థలం చాలడం లేదు. సామూహిక ఖననాలు చేయాల్సి వస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story