నేపాల్‌లో.. భారీ వర్షాలు

నేపాల్‌లో.. భారీ వర్షాలు
వరదల్లో ఇప్పటి వరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోగా మరో 28 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు.

నేపాల్‌లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు పోటెత్తుతున్నాయి. వర్షాల కారణంగా చాలా చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. వరదల్లో ఇప్పటి వరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోగా మరో 28 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. తూర్పు నేపాల్‌లో వరదల ప్రభావం తీవ్రంగా ఉంది. చైన్‌పుర్‌ మున్సిపాలిటీ-4 ప్రాంతంలో హేవా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో సూపర్‌ హేవా హైడ్రోపవర్‌ ప్రాజెక్టు వద్ద వరదలు సంభవించి అక్కడ పనిచేసే కార్మికులు గల్లంతయ్యారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. చైన్‌పుర్‌, పంచఖపన్‌ మున్సిపాలిటీల్లో కొండచరియలు విరిగిపడి హేవా నది ప్రవాహాన్ని అడ్డుకున్నాయి. దీంతో వరదలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. వరదలకు పలు ప్రాంతాల్లో ఇళ్లు కొట్టుకుపోయాయి.

దేశంలోకి గత బుధవారం రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో రానున్న రోజుల్లో నేపాల్‌ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. నదుల్లో నీటిమట్టం పెరగడంతో సమీప ప్రాంతాల ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వరద సంబంధిత మరణాలపై నేపాల్‌ ప్రధాని పుష్ప కుమార్‌ దహల్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Tags

Read MoreRead Less
Next Story