Israel War: హమాస్ కంటే హిజ్బుల్లా డేంజర్

Israel War: హమాస్ కంటే  హిజ్బుల్లా డేంజర్
లక్షకు పైగా రాకెట్లు..?

హమాస్‌తో భీకర పోరు జరుగుతున్న వేళ.. ఇజ్రాయెల్‌కు హిజ్బుల్లా రూపంలో మరో సవాల్ ఏదురు కానుంది. లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా సంస్థ యుద్ధంలో హమాస్‌తో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. సమయం వచ్చినప్పుడు హమాస్‌ తరపున రంగంలోకి దిగుతామన్న హిజ్బుల్లా తమ ప్రణాళిక ప్రకారమే ముందుకు సాగుతున్నట్లు తెలిపింది.హమాస్‌ ఆకస్మిక దాడుల నుంచి తేరుకుని ప్రతిదాడులతో గాజాపై యుద్ధాన్ని ప్రకటించిన ఇజ్రాయెల్‌కు మరో ముప్పు ఎదురు కానుంది. ఇజ్రాయెల్‌తో పోరులో హమాస్‌తో భాగమయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు, లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా సంస్థ ప్రకటించింది. ఓ ర్యాలీ సందర్భంగా హిజ్బుల్లా డిప్యూటీ చీఫ్ నయీమ్‌ ఖాసీమ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. లెబనాన్‌లో షియా వర్గానికి చెందిన హిజ్బుల్లా ఇరాన్‌ అండదండలతో బలీయమైన శక్తిగా ఎదిగింది.


ఆర్థికంగా, ఆయుధపరంగానూ ఈ సంస్థకు ఇరాన్‌ సాయం చేస్తోంది. హిజ్బుల్లా లక్ష్యం కూడా ఇజ్రాయెల్‌ను తొలగించి పాలస్తీనా స్వతంత్ర దేశాన్ని ఏర్పాటు చేయడమే కావడంతో హమాస్ ఉగ్రదాడి అనంతరం కొన్ని రాకెట్లను ఇజ్రాయెల్‌ భూభాగంపై ప్రయోగించింది. దీనికి స్పందనగా ఇజ్రాయెల్ హిజ్బుల్లా స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. 1980ల్లో లెబనాన్‌లో ఏర్పడిన ఈ సంస్థ రాజకీయంగానూ, మిలటరీ పరంగానూ బలోపేతంగా ఉంది. ఈ సంస్థ దగ్గర ఇప్పటికే లక్షకుపైగా రాకెట్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీటితోపాటు స్వల్ప లక్ష్యాలను ఛేదించే క్షిపణులు సైతం ఉన్నట్టు తెలుస్తోంది. హమాస్‌ మిలిటెంట్లతో పోలిస్తే వీరి సంఖ్య అధికంగా ఉంది. హిజ్బుల్లాలో లక్షకుపై క్రియాశీల బలగాలు ఉన్నట్టు పాశ్చాత్య నిఘావర్గాలు పేర్కొన్నాయి. గతంలో హమాస్‌, హిజ్బుల్లా ఉగ్రసంస్థలపై ఇజ్రాయెల్‌ దాడులు చేసినా పూర్తిగా నిర్మూలించలేకపోయింది. రానున్న రోజుల్లో హిజ్బుల్లాతో తలపడితే ఎలాంటి వ్యూహాలను ఇజ్రాయెల్‌ సైన్యం అమలు చేస్తుందనేది ఆసక్తిగా మారింది.



ఇజ్రాయెల్ పై హిజ్బుల్లా దాడులు చేయడం కొత్తేమీ కాదు. 1985, 2000, 2006ల్లో ఇజ్రాయెల్‌ దళాలు, హిజ్బుల్లా మధ్య ఘర్షణలు జరిగాయి. సిరియా అంతర్యుద్ధంలో రష్యా, ఇరాన్‌ దళాలతో పాటు హిజ్బుల్లా ప్రవేశంతో సిరియా ప్రభుత్వం, తిరుగుబాట్లను సమర్థవంతంగా అణచివేసింది. 2006లో ఇజ్రాయెల్‌, హిజ్బుల్లా మధ్య దాదాపు 34 రోజుల పాటు యుద్ధం జరిగింది. ఇరువర్గాల మధ్య ఒప్పందం కుదరడంతో ఇజ్రాయెల్‌ దళాలు వెనక్కు మళ్లాయి. అయితే ఈ యుద్ధం తరువాత హిజ్బుల్లా ఆయుధ శక్తి భారీగా పెంచుకుంది.

Tags

Read MoreRead Less
Next Story