India Canada Private Talks : భారత్, కెనడా​ మంత్రుల రహస్య చర్చలు

India Canada Private Talks : భారత్, కెనడా​ మంత్రుల రహస్య చర్చలు
ఇప్పుడైనా సమస్య కొలిక్కివచ్చేనా?

భారత్,కెనడా మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు అనిపిస్తోంది. ఈ క్రమంలోనే భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్, కెనడా విదేశాంగ మంత్రి మెలనీ జాలీ రహస్యంగా భేటీ అయినట్టు సమాచారం. ఈ సమావేశం కొన్ని రోజుల క్రితమే జరిగినట్టు, వీళ్లిద్దరూ వాషింగ్టన్‌లో సమావేశమైనట్టు కొన్ని నివేదికలు వెల్లడించాయి. బ్రిటీష్ న్యూస్‌పేపర్ ఫైనాన్సియల్ టైమ్స్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది. అయితే...ఈ రహస్య సమావేశంపై ఇటు భారత్ కానీ అటు కెనడా కానీ స్పందించలేదు.

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందనే కెనడా ఆరోపణలతో రెండు దేశాల మధ్య గత కొంత కాలంగా దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వివాదాన్ని పరిష్కరించుకునేందుకు రెండు దేశాల విదేశాంగ మంత్రులు రహస్యంగా సమావేశమైనట్టు తెలుస్తోంది. ఫైనాన్షియల్ టైమ్స్ కథనం ప్రకారం.. భారత్‌తో దౌత్యపరమైన సమస్యలను పరిష్కరించుకోవడానికి కెనడా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఈ భేటీ కూడా జరిగినట్లు అర్థమవుతోంది. ఇప్పటికే మన దేశం డిమాండ్ చేసినట్లుగా ఢిల్లీలో ఉన్న కెనడా దౌత్యవేత్తలను తగ్గించుకుంటున్నట్లు ఆ దేశం వెల్లడించింది. పైగా ఈ నెల ప్రారంభంలో కెనడా విదేశాంగ మంత్రి మాట్లాడుతూ సమస్యను ప్రైవేట్‌గా పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అటు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా భారత్‌తో ఉద్రిక్తత పరిస్థితులు ఇంకా పెరగాలని తాము కోరుకోవడం లేదని ఇప్పటికే ప్రకటించారు. భారత్ కోరినట్టుగా 30 మంది తమ దౌత్య వేత్తలను కెనడా ప్రభుత్వం కౌలాలంపూర్ లేదా సింగపూర్‌కు తరలించినట్లు ఆ దేశానికి చెందిన సీటీవీ న్యూస్ తెలిపింది.


అయినా నిపుణుల అభిప్రాయం ప్రకారం ఖలిస్థానీ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ పాత్ర ఉందని ఆరోపించడమే కాకుండా.. అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టపై బురదజల్లే ప్రయత్నం చేసిన కెనడాకి, ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవడం లేదు. అత్యంత సన్నిహిత దేశాలైన అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా కేవలం ప్రకటనలతో సరిపెట్టాయి. న్యూజిలాండ్ అయితే అది కూడా లేదు. ఈ అంశంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తొందరపాటుతో వ్యవహరించినట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే కెనడా ఆరోపణలను తక్షణం ఖండించిన భారత్, ఈ విషయంలో తమకు ఆధారాలు ఇస్తే పరిశీలిస్తామని ప్రకటించింది. తదనంతర పరిణామాలతో కెనడా పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. భారత విదేశాంగ మంత్రి జై శంకర్ తో కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ కొన్ని రోజుల క్రితం వాషింగ్టన్ లో చర్చలు జరిపినట్టు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story