భారత్‌ చైనా అంగీకారం.. గల్వాన్‌లోయ ప్రాంతం ఇక గస్తీ రహితం?

భారత్‌ చైనా అంగీకారం.. గల్వాన్‌లోయ ప్రాంతం ఇక గస్తీ రహితం?

లద్ధాఖ్‌ సరిహద్దుల్లో నెలకొన్న ఘర్షణాత్మక పరిస్థితిని ముగించాలని భారత్‌ చైనా సూత్రప్రాయంగా అంగీకరించాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ ముందున్న పరిస్థితిని పునరుద్ధరించాలని నిర్ణయించాయి. అయితే దీనికి సంబంధించిన ఒప్పందమేదీ ఇంకా ఖరారు కాలేదని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. మూడు దశల్లో ఇరుదేశాలూ దళాల ఉపసంహరణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఒప్పందంపై సంతకం చేసిన మూడు రోజుల్లోగా సరిహద్దుల్లో మోహరించిన సాయుధ బలగాలతో కూడిన శకటాలను, యుద్ధ ట్యాంకులను వెనక్కి తీసుకురావాలి. రోజుకు 30 శాతం బలగాల చొప్పున 3 రోజులపాటు మొత్తం సైన్యాన్ని పాంగాంగ్‌ సరస్సు ఉత్తర, దక్షిణ తీరాల నుంచి ఉపసంహరించాలి. అనంతరం రెండు దేశాల సైన్యాధికారులూ ఉపసంహరణ జరిగినదీ లేనిదీ నిర్ధారించుకోవాలి.

ఈనెల ఆరోతేదీన- వాస్తవాధీన రేఖ వద్ద - భారత భూభాగంలోని ఛుషుల్‌ సెక్టార్‌లో రెండు దేశాల సైనిక ఉన్నతాధికారులు జరిపిన 8 రౌండు చర్చల్లో ఈ ప్రాథమిక ఒప్పందం కుదిరింది. వచ్చే రెండు మూడు రోజుల్లో 9వ రౌండు చర్చలు జరగనున్నాయని, అందులో ఒప్పందంపై సంతకాలు జరగవచ్చని సైనిక వర్గాలు తెలిపాయి. ఒప్పందం ఖరారవుతుందన్న ఆశాభావాన్ని ఆర్మీ ఛీఫ్‌ ఎంఎం నరవణే కూడా వ్యక్తం చేశారు. 7 రౌండ్ల దాకా జరిగిన చర్చలు ఎలాంటి ఫలితాన్నీ ఇవ్వలేదు. ఎనిమిదో రౌండ్లో మాత్రం భారత విదేశాంగ, రక్షణ అధికారులు కూడా పాల్గొని చైనా బృందంపై ఒత్తిడి తెచ్చారు. నేతల మధ్య కుదిరిన అంగీకారాన్ని అమలు చేయడంలో జాప్యం వద్దని సూచించారు. దీంతో చైనా కూడా ఒప్పుకుంది.


Tags

Read MoreRead Less
Next Story