పాంగాంగ్‌ వద్ద భారత్‌దే పైచేయి.. వాయుసేన మోహరింపును పెంచుతోన్న చైనా..

పాంగాంగ్‌ వద్ద భారత్‌దే పైచేయి.. వాయుసేన మోహరింపును పెంచుతోన్న చైనా..
సరిహద్దులో భారత్‌- చైనాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓ పక్క శాంతి మంత్రం జపిస్తూనే చైనా..

సరిహద్దులో భారత్‌- చైనాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓ పక్క శాంతి మంత్రం జపిస్తూనే చైనా యుద్ధ సన్నాహాలు కొనసాగిస్తోంది. లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ సరస్సు వద్ద ఘర్షణ అనంతరం ప్రారంభమైన ఇరుదేశాల బ్రిగేడియర్‌ స్థాయి చర్చలు నిన్న కూడా ఎలాంటి ఫలితం లేకుండానే ముగిశాయి. వాస్తవాధీన రేఖ వెంబడి భారత భూభాగంలోని చుశుల్‌ వద్ద ఉదయం 11 నుంచి 2 గంటల వరకూ ఈ చర్చలు జరిగాయి. లద్దాఖ్‌ తూర్పు ప్రాంతంలో ఎల్‌ఏసీ వెంబడి పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని సైన్యాధ్యక్షుడు జనరల్‌ ఎంఎం నరవాణే చెప్పారు. రెండ్రోజులపాటు లద్దాఖ్‌లో పర్యటించిన ఆయన సైన్యాధికారులు, జవాన్లతో మాట్లాడారు. దేశ రక్షణకు సైన్యం కట్టుబడి ఉందన్నారు.

దక్షిణ పాంగాంగ్‌ సరస్సు వద్ద భారత్‌ నుంచి గట్టి ప్రతిఘటన ఎదురుకావడంతో కాస్త తగ్గిన చైనా.. అదే ప్రాంతంలో సైనిక దళాల మోహరింపును ముమ్మరం చేసింది. అత్యాధునిక యుద్ధ ట్యాంకులను అక్కడికి తరలించింది. వాస్తవాధీన రేఖకు 20 కిలోమీటర్ల దూరంలో వీటిని సన్నద్ధంగా ఉంచింది. థాకుంగ్‌ నుంచి ముక్పాడీ వరకూ అన్ని కొండలపైనా భారత దళాలు మోహరించి ఉన్నాయి. చైనా వైపున భారీగా కాల్బలం తరలి వెళుతున్న దృశ్యాలు భారత సైన్యానికి కనిపించినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. భారత్‌ కూడా టీ-90, టీ-72ఎం1 అత్యాధునిక యుద్ధ ట్యాంకులను అక్కడికి తరలించింది. ఫింగర్‌-5 వరకు అనేక పర్వత సానువులు భారత అధీనంలోనే ఉన్నాయి. ప్రస్తుతం పాంగాంగ్‌ వద్ద భారత్‌దే పైచేయిగా ఉంది. వాయుసేన మోహరింపును కూడా చైనా క్రమేణా పెంచుతోంది.

అటు ఇండో-టిబెటన్‌ సరిహద్దు పోలీస్‌ దళం.. పూర్తి అప్రమత్తంగా ఉంది. ఐటీబీపీ చీఫ్‌ ఎస్‌ఎస్‌ దేస్వాల్‌ వారం రోజులుగా లద్దాఖ్‌లోనే మకాం వేశారు. తూర్పు లద్దాఖ్‌లోని ఉత్తర సబ్‌-సెక్టార్‌ నుంచి దక్షిణం వరకూ అన్ని ప్రాంతాలనూ ఆయన సందర్శిస్తూనే ఉన్నారు. 5,000 ఐటీబీపీ దళాలను ఎక్కడికక్కడ సమాయత్తం చేస్తూ, వారికి సూచనలిస్తున్నారు. దౌలత్‌బాగ్‌ ఓల్డీ నుంచి దక్షిణం వైపునున్న అనేక పర్వత శిఖరాలపైకి ఐటీబీపీ దళం వెళ్లి.. భారత సైన్యానికి సహకరించింది. భారత్‌లో శరణార్థులుగా ఉన్న టిబెటన్ల బెటాలియన్‌ అయిన స్పెషల్‌ ఫ్రాంటియర్‌ ఫోర్స్‌ అదనపు బలగాలను శుక్రవారం సిమ్లా నుంచి లద్దాఖ్‌కు తరలించారు. వారిని 'భారత్‌ మాతాకీ జై' నినాదాలతో టిబెటన్లు సాగనంపారు.

Tags

Read MoreRead Less
Next Story