Maldives: చైనాతో మాల్దీవుల సైనిక సహకార ఒప్పందం

Maldives: చైనాతో మాల్దీవుల సైనిక సహకార ఒప్పందం
భారత సైనికులకు మాల్దీవుల అధ్యక్షుడు హెచ్చరికలు

భారత్‌ను వ్యతిరేకించే మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు మనకు పక్కలో బల్లెంలా ఉన్న చైనాతో సైనిక సహకార ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. మాల్దీవుల్లోని భారత్‌ బలగాలపై మరోసారి తన అక్కసు వెలగక్కారు. మే 10 తర్వాత భారత్‌కు చెందిన సైనికులు మాల్దీవుల్లో సైనిక దుస్తుల్లోనే కాదు సాధారణ దుస్తుల్లో కూడా ఉండరని స్పష్టం చేశారు.

భారత్‌తో వివాదం వేళ చైనాకు దగ్గరవుతున్న మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు..మరోసారి భారత్‌పై వ్యతిరేక గళం వినిపించారు. మే 10 తర్వాత తమ దేశంలో భారత్‌ సైనికులు..సైనిక దుస్తుల్లోనే కాదు, సాధారణ దుస్తుల్లో కూడా ఉండరని ముయిజ్జు మీడియాకు తెలిపారు. బా అటోల్‌లో జరిగిన పర్యటనలో పాల్గొన్న ముయిజ్జు....తమ దేశం నుంచి భారత్‌ బలగాల ఉపసంహరణలో విజయం సాధించినట్లు వెల్లడించారు. దీనిపై తప్పుడు వదంతులను సృష్టించి, పరిస్థితులను వక్రీకరించేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. మల్దీవులతో ఒప్పందంలో భాగంగా భారత సాంకేతిక బృందం గతవారం ఆ దీవులకు చేరుకుంది. దీనిపై కొన్ని విపక్షాలు...సైనికులే తమ దుస్తులను మార్చుకొని సాధారణ దుస్తుల్లో వస్తున్నారన్న అనుమానాల రేకెత్తించాయి. దీనిపై స్పందించిన ముయిజ్జు ఈ వ్యాఖ్యలు చేశారు.

తాజాగా మాల్దీవులకు ఉచితంగా సైనిక సహకారం అందించేందుకు చైనా ముందుకొచ్చింది. దీనిపై ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. మాల్దీవుల రక్షణ మంత్రి మహమ్మద్‌ ఘాసన్‌తో..చైనా మేజర్‌ జనరల్‌ జాంగ్‌ బావోకున్‌ సోమవారం మాలెలో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని బలోపేతం చేసుకునే అంశంపై చర్చలు జరిపారు. అనంతరం మాల్దీవులకు సైనిక సహకారం అందించే ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం వివరాలను రెండు దేశాలు బయటకు వెల్లడించనప్పటికీ.. ఈ సైనిక సహకారాన్ని చైనా ఉచితంగా అందించనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

భారత్ కు చెందిన సైనికులు ఈ ఏడాది మే 10 తర్వాత తమ దేశంలో ఉండకూడదని ముయిజ్జు తెలిపారు. డ్రాగన్ మద్దతుతో మాల్దీవుల అధ్యక్షుడు ఈ చర్యలకు పాల్పడుతున్నారు. భారత సైనికులు సివిల్ డ్రెస్సుల్లో కూడా తిరగొద్దంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. మే 10 తర్వాత భారత సైనికులను మాల్దీవుల్లో ఎవరిని ఉండనివ్వం అని ముయిజ్జు వెల్లడించారు. మాల్దీవులలోని మూడు వైమానిక స్థావరాల్లో ఒకదానిలో విధులు నిర్వర్తిస్తున్న భారత సైనిక సిబ్బందిని మార్చి 10లోగా మిగతా రెండు స్థావరలాల్లోని బలగాలను మే 10 నాటికి వెనక్కి వెళ్లిపోవాలని మాల్దీవుల విదేశాంగమంత్రిత్వ శాఖ తెలిపింది. సైనిక సహకారంపై చైనాతో మాల్దీవులు ఒప్పందం చేసుకున్న కాసేపటికే ముయిజ్జు ఈ వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారానికి తెరలేపింది.

Tags

Read MoreRead Less
Next Story