Vladimir Putin: మోదీతో అంత ఈజీ కాదు ..

Vladimir Putin: మోదీతో అంత ఈజీ కాదు ..
ప్రధానిపై మరోసారి ప్రశంసలు కురిపించిన పుతిన్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి ప్రశంసలు కురిపించారు. భారత ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవాలని మోదీని బెదిరించడం, బలవంతం చేయడాన్ని తాను ఊహించలేనని ఆయన అన్నారు. ఆయనపై అలాంటి ఒత్తిడి ఉందని తనకు తెలిసినప్పటికీ, దేశ ప్రయోజనాల కోసం మోదీ మొండిగా ఉంటారని పుతిన్ అన్నారు.

భారత్ లో ఏం జరుగుతుందో తాను బయటి నుంచి చూస్తున్నానని పుతిన్ అన్నారు. భారత ప్రజల ప్రయోజనాలను పరిరక్షించడంలో మోదీ కఠిన వైఖరిని చూసి తాను కొన్నిసార్లు ఆశ్చర్యపోయానని అన్నారు. రష్యా కాలింగ్ రమ్ కార్యక్రమంలో అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ పుతిన్ ఈ విషయాలు చెప్పారు. రష్యా, భారత్‌ల మధ్య సంబంధాలు అన్ని దిశల్లో అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. ఇందుకు ప్రధాన కారణం.. ప్రధాని మోదీ విధానమేనని, ప్రధాని మోదీ భారతదేశ ప్రయోజనాల కోసం అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు.

జాతీయ భద్రత విషయంలో మోదీ నిక్కచ్చిగా వ్యవహరిస్తున్న తీరు తనకు ఆశ్చర్యం కలిగిస్తుందని పుతిన్ పేర్కొన్నారు. ‘‘నిజం చెప్పాలంటే ఒక్కోసారి నేను కూడా మోదీ ప్రజాప్రయోజనాల దృష్ట్యా తీసుకునే నిర్ణయాలు చూసి ఆశ్చర్యపోతుంటా’’ అని అన్నారు. ‘‘జాతి, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమైన నిర్ణయాలు తీసుకోవాలంటూ మోదీని ఎవరు బలవంతం పెట్టలేరు, బెదిరించలేరు. అయితే, ఆయనపై అలాంటి ఒత్తిడులు ఉన్నాయని మాత్రం నాకు తెలుసు’’ అని పుతిన్ పేర్కొన్నారు. ఈ ఏడాది అక్టోబర్‌ 4న జరిగిన ఈస్టర్న్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ 8వ సదస్సులో మోదీని, మేడ్‌ ఇన్‌ ఇండియాపై ఆయన పట్టుదలను పుతిన్‌ ప్రశంసించారు. నరేంద్ర మోదీ చాలా తెలివైన వ్యక్తని ఆయన అన్నారు. ఆయన నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి పరంగా గొప్ప ప్రగతిని సాధిస్తోందని పొగిడారు. ఈ ఎజెండాపై పనిచేయడం భారతదేశం, రష్యా రెండింటి ప్రయోజనాలకు పూర్తిగా సరిపోతుందని అన్నారు.

వచ్చే ఏడాది మార్చి 17న రష్యాలో కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నికలు జరగనున్నాయి. పుతిన్ ఐదోసారి ఎన్నికల్లో పోటీ చేస్తారని విశ్వసనీయ సమాచారం. అయితే, పుతిన్ ముందు ప్రతిపక్షం చాలా బలహీనంగా ఉంది. కానీ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మధ్య, ఆయన ఎన్నికల్లో కొత్త సవాళ్లను ఎదుర్కోవలసి రావచ్చని విశ్లేషకులు అంటున్నారు


Tags

Read MoreRead Less
Next Story