Qatar: ఇది భారత్ దౌత్య విజయం..

Qatar: ఇది భారత్ దౌత్య   విజయం..
ఖ‌త‌ర్ నుంచి క్షేమంగా స్వ‌దేశానికి మాజీ నేవీ అధికారులు

దౌత్యపరంగా భారత్‌ అద్భుత విజయాన్ని సాధించింది. గూఢచర్య ఆరోపణలతో అరెస్టయిన ఎనిమిది మంది భారత నేవీమాజీ అధికారులను ఖతర్‌ ప్రభుత్వం విడుదల చేసింది. వారిలో ఇప్పటికే ఏడుగురు ఢిల్లీకి చేరుకున్నారు. నౌకాదళ మాజీ అధికారులకు విధించిన మరణ శిక్షను ఇప్పటికే న్యాయస్థానం జైలు శిక్షగా మార్చిన విషయం తెలిసిందే. తాజాగా దాని నుంచి కూడా విముక్తి కల్పించి వారిని భారత్‌కు అప్పగించింది. దీంతో ఖతార్‌ నిర్ణయాన్ని భారత ప్రభుత్వం స్వాగతించింది. ఎనిమిది మంది పౌరులను విడుదల చేసినందుకు కృతజ్ఞతలు తెలిపింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. వీరు 18 నెలలపాటు శిక్ష అనుభవించారు.

"ఖతార్‌లో బంధీలుగా మారిన భారతీయ పౌరులను విడుదల చేయడాన్ని స్వాగతిస్తున్నాం. వారిలో ఇప్పటికే ఏడుగురు భారత్ చేరుకున్నారు. ఖతార్ ప్రభుత్వానికి ధన్యవాదాలు" అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కమాండర్ అమిత్ నాగ్‌పాల్, కెప్టెన్ సౌరభ్ వశిష్ఠ, కెప్టెన్ నవ్‌తేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కమాండర్ పూర్ణేందు తివారీ, కమాండర్ సుగునాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్తాలు భారత్‌కు తిరిగొచ్చిన వారిలో ఉన్నారు.

అసలేం జరిగిందంటే

2022లో గూఢచర్యం ఆరోపణల కింద ఇండియన్‌ నేవీకి చెందిన ఎనిమిది మంది మాజీ సిబ్బందిని ఖతార్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో కెప్టెన్‌ నవతేజ్‌ సింగ్‌ గిల్‌, సౌరభ్‌ వశిష్ఠ్‌, కమాండర్లు బీరేంద్ర కుమార్‌ వర్మ, పూర్ణేందు తివారీ, సంజీవ్‌ గుప్తా, అమిత్‌ నాగ్‌పాల్‌, ఏపీలోని విశాఖకు చెందిన సుగుణాకర్‌ పాకాల, సెయిలర్‌ రాగేశ్‌ ఉన్నారు. అయితే అక్కడి ప్రాథమిక కోర్టు రెండు మూడుసార్లు మాత్రమే విచారణ జరిపి వారికి మరణ శిక్ష విధించింది. దానిని రద్దు చేయించేందుకు భారత ప్రభుత్వం దౌత్యపరంగా తీవ్ర ప్రయత్నాలు చేసింది. దీంతో అప్పీలు చేసుకోవడానికి అక్కడి కోర్టు అనుమతించింది. పూర్తి విచారణ జరిపిన న్యాయస్థానం మరణ దండనను జైలు శిక్షగా మారుస్తూ 2023 డిసెంబర్‌ 28న తీర్పునిచ్చింది. దీన్ని కూడా అప్పీలు చేసుకునేందుకు 60 రోజుల గడువిచ్చింది. దీంతో అందుబాటులో ఉన్న అన్ని న్యాయమార్గాలను వినియోగించుకున్న భారత విదేశాంగ శాఖ వారి విడుదలకు కృషి చేసింది. అవన్నీ ఫలించడంతో 18 నెలల తర్వాత సోమవారం ఉదయం వారు స్వదేశానికి చేరుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story