Queensland Floods: జలదిగ్బంధంలో క్వీన్స్‌లాండ్‌..రంగంలో దిగిన మిలటరీ

Queensland Floods: జలదిగ్బంధంలో క్వీన్స్‌లాండ్‌..రంగంలో దిగిన మిలటరీ
మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశం

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌ రాష్ట్రంలో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదై వరదలు ముంచెత్తాయి. నదులు, కాల్వలు కట్టలు తెంచుకొన్నాయి. రహదారులు, రైల్వే మార్గాలు కొట్టుకుపోయాయి. వేలాది ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. వరద ప్రభావిత ప్రాంతంలో ఇళ్లపైకప్పులపైకి చేరిన 300 మందిని సహాయక సిబ్బంది హెలికాప్టర్లతో కాపాడారు. కెయిర్న్స్ విమానాశ్రయంలో వరద నీరు చేరి అక్కడ ఉన్న విమానాలు రెక్కల వరకు మునిగాయి..

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌ రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టించాయి. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవడంతో అనేక పట్టణాలను వరద నీరు ముంచెత్తింది. రహదారులన్నీ నదులను తలపించాయి. పోర్ట్ డగ్లస్‌కు ఉత్తరాన ఉన్న వుజాల్‌వుజాల్‌ నగరం పూర్తిగా నీటిలో చిక్కుకుపోయింది. దీనికి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఈ ప్రాంతంలో ఇళ్లపైకప్పులపైకి ఎక్కి ప్రాణాలు దక్కించుకున్న 300 మందిని హెలికాప్టర్‌తో సహాయక బృందాలు కాపాడాయి.

కెయిర్న్స్‌ నగరంలో ఏకంగా 2 మీటర్ల వర్షపాతం నమోదైంది. అక్కడ భారీ వరదలు విరుచుకుపడ్డాయి. నీట మునగడంతో కెయిర్న్స్ విమానాశ్రయాన్ని మూసివేశారు. ఇక్కడ కొన్ని విమానాలు రెక్కల వరకు నీట మునిగాయి. భారీ సంఖ్యలో ప్రజలు ఇళ్లను వీడి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. మరికొందరు అక్కడే చిక్కుకుపోయారు. ఆస్పత్రులు కూడా నీట మునిగాయి. కెయిర్న్స్‌ నగరంలోకి మొసళ్లు కొట్టుకొచ్చాయి. ఇప్పటికే సహాయక బృందాలు రంగంలోకి దిగినట్లు అధికారులు వెల్లడించారు. కెయిర్న్స్‌ నగరంలో ఉన్న లక్షా 60 వేల మంది జనాభాకు తాగునీటి కొరత ఎదురయ్యే ప్రమాదం కనిపిస్తోంది.


1977లో నమోదైన భారీ వరదల రికార్డును ఇవి దాటేసి ఉంటాయని క్వీన్స్‌లాండ్‌ ప్రీమియర్‌ జాన్‌ మైల్స్‌ పేర్కొన్నారు. 24 గంటల వ్యవధిలో బ్లాక్‌ మౌంటైన్‌లో 625 మిల్లీమీటర్ల వర్షం పడినట్లు అక్కడి వాతావరణ శాఖ వెల్లడించింది. మరికొన్ని ప్రాంతాల్లో 300 మిల్లీమీటర్ల మేర వర్షం కురిసినట్లు తెలిపింది. తుపాను మొదలైన నాటి నుంచి 20 చోట్ల మీటరుకు పైగా వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. డెయిన్‌ట్రీ నదీ పరీవాహక ప్రాంతంలో మొత్తం 820మి.మీల వర్షపాతం రికార్డైంది. రానున్న 24 గంటల్లో కొన్ని చోట్ల 500మిల్లిమీటర్ల వర్షం పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది..

ఇటీవల కాలంలో ఆస్ట్రేలియాలో ఒక ప్రదేశం ఈ స్థాయి వర్షపాతం చవిచూడటం ఇదే తొలిసారి అని అధికారులు భావిస్తున్నారు. ఫలితంగా నదులు, కాల్వలు కట్టలు తెంచుకొన్నాయి. రహదారులు, రైల్వే మార్గాలు కొట్టుకుపోయాయి. వేలాది ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఈ వరదలకు ఎంత లేదన్నా బిలియన్‌ డాలర్ల వరకు నష్టం వాటిల్లినట్లు భావిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story