Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌పై అవిశ్వాస తీర్మానం

Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌పై అవిశ్వాస తీర్మానం
బ్రిటన్‌ హోంమంత్రి బ్రేవర్మన్‌పై వేటు వేసిన కారణం గానే

బ్రిటన్‌ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. హోం సెక్రెటరీ సుయెల్లా బ్రెవర్మన్‌ను మంత్రివర్గం నుంచి తొలగించినందుకు తీవ్ర విమర్శల పాలవుతున్న రిషి సునాక్‌‌పై సొంత పార్టీ ఎంపీ ఆండ్రియా జెంకిన్స్ అవిశ్వాస తీర్మానం లేఖ ప్రవేశపెట్టారు. ఈ తీర్మానం తాలూకు ఫొటోను సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. ‘‘జరిగింది చాలు. రిషి సునాక్ పక్కకు తప్పుకోవాల్సిందే’’ అని జెంకిన్స్ ఎక్స్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన అవిశ్వాస తీర్మానం తాలూకు లేఖను పార్టీలోని 1922 కమిటీకి పంపినట్టు చెప్పారు. ‘‘నిజం మాట్లాడినందుకు ఆమెను తప్పించారు. పార్టీలోని లెఫ్ట్ నేతల ఒత్తిడికి లోనై రిషి తప్పుడు నిర్ణయం తీసుకున్నారు’’ అని ఎక్స్ వేదికగా కామెంట్ చేశారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన బోరిస్ జాన్సన్ పక్కకు తప్పుకోవడానికి కూడా రిషి సునాక్ కారణమని ఈసందర్భంగా ఆరోపించారు. బ్రెక్జిట్ కోసం బోరిస్ పార్లమెంటులో ధైర్యంగా పోరాడారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ పదవుల్లో లేని అధికార పార్టీ ఎంపీలు 1922 కమిటీలో ఉంటారు. ఈ కమిటీ సభ్యులు ప్రభుత్వ, తమ పార్టీ నిర్ణయాలను ప్రభావితం చేయగలరు.

అసలేం జరిగిందంటే..

బ్రిటన్ హోం మంత్రి సుయెల్లా బ్రేవర్‌మన్‌ను బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునక్ తొలగించారు. ఆమె స్థానంలో జేమ్స్‌ క్లెవర్లీని నియమించారు. అలాగే మాజీ ప్రధాని డేవిడ్‌ కామెరూన్‌కు విదేశాంగ శాఖ బాధ్యతలు అప్పగించారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా బ్రేవర్‌మన్ తొలగించినట్లు ప్రభుత్వం సోమవారం తెలిపింది. అయితే నివేదిక ప్రకారం.. బ్రేవర్‌మాన్‌ను తొలగించాలని సునక్‌పై ఒత్తిడి పెరిగింది. కారణం, ఇజ్రాయెల్-హమాస్ వివాదం ప్రారంభమైన తర్వాత లండన్‌లో జరిగిన ప్రదర్శనల కఠినంగా వ్యవహరించడం లేదని ఆరోపిస్తూ మెట్రోపాలిటన్ సిటీ పోలీసులను బ్రావర్‌మాన్ లక్ష్యంగా చేసుకున్నారు.

కొద్దిరోజుల క్రితం లండన్‌లో పాలస్తీనా మద్దతుదారులు చేపట్టిన ర్యాలీని నియంత్రించకపోగా మెట్రోపాలిటన్‌ పోలీసులు అనుకూలంగా వ్యవహ రించారని విమర్శిస్తూ బ్రేవర్మన్‌ ‘ది టైమ్స్‌’కు రాసిన కథనం తీవ్ర విమర్శలకు కారణమైంది. ఈ నేపథ్యంలో బ్రేవర్మన్‌ను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ ప్రధాని సునాక్‌ నిర్ణయం తీసుకున్నారు. బ్రేవర్మన్‌ గతంలో వలసలపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పదవిని పోగొట్టుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story