ఒక్కరోజు ఇమిగ్రేషన్ అధికారిగా బ్రిటన్ ప్రధాని

ఒక్కరోజు ఇమిగ్రేషన్ అధికారిగా బ్రిటన్ ప్రధాని
హోటళ్లు, షాప్ లలో ఆకస్మిక తనిఖీలు

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఒక్క రోజు ఇమిగ్రేషన్ అధికారిగా మారారు. ఒకే ఒక్కడు సినిమాలో హీరో అర్జున్ సింగిల్ డే సీఎంగా పనిచేసినట్టు హుషారుగా అధికారులతో కలిసి స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. అక్రమ వలసలను అడ్డుకుంటానంటూ ఇచ్చిన హామిని నెలబెట్టుకొనే పనిలో దిగారు. యూకే వ్యాప్తంగా నిర్వహించిన ఈ స్పెషల్ డ్రైవ్ లో 105 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించి షాపులు, హోటళ్లు తనిఖీ చేశారు. అక్రమంగా దేశంలోకి వలస వచ్చి, అనుమతి లేకున్నా పనిచేస్తున్న వారిని పట్టుకోవడానికి ప్రధాని సునాక్ ఇలా ఒక్క రోజు అధికారిగా మారారు. అక్రమంగా వలస వచ్చిన వారివల్ల యూకే పౌరులు నష్ట పోతున్నారని, ఉద్యోగాలు దొరకక తక్కువ వేతనాలకే పనిచేయాల్సి వస్తోందని అన్నారు. ఈ పరిస్థితిని తప్పిస్తానని, అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతానని ప్రధాని అభ్యర్థిగా బరిలో నిలిచిన సమయంలో రిషి సునాక్ హామీ ఇచ్చారు. ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈమేరకు చర్యలు తీసుకున్నారు. ఫీల్డ్ లెవల్ లో పరిస్థితులను తెలుసుకోవడానికి, అధికారుల పనితీరుపై అవగాహన కోసం సునాక్ ఇలా ఒక్కరోజు డ్యూటీ చేశారు.

బ్రిటన్‌లోకి అక్రమంగా ప్రవేశించే వారిని ఆశ్రయం పొందేందుకు ఎట్టిపరిస్థితుల్లో అనుమతించబోమని దేశ ప్రధాని రిషి సునాక్ ఇటీవల హెచ్చరికలు చేశారు. ఈ మేరకు మార్చ్ నెలలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. దీంతో అక్రమ చొరబాట్లను నిరోధించేందుకు యూకే ప్రభుత్వానికి హక్కు లభించినట్లయ్యింది. ఈ చట్టం ప్రకారం దేశవ్యాప్తంగా మెరుపు దాడులు కొనసాగుతున్నాయి.

వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అక్రమ వలసదారులపై బ్రిటన్ ప్రధాని ఉక్కుపాదం మోపుతున్నారు. దేశవ్యాప్తంగా గురువారం 159 చోట్ల మెరుపు దాడులు నిర్వహించారు. హోటళ్లు, దుకాణాలు, సెలూన్లు, బార్‌లు, కార్‌ వాషింగ్‌ సెంటర్లలో పనిచేస్తున్న 20 పట్టణాలలో 105 మందిని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో 40 మందిని జైలుకు తరలించి, మిగిలిన వారిని ఇమ్మిగ్రేషన్‌ బెయిల్‌పై విడుదల చేశారు. అనేక అరెస్టులు యూకే నుంచి స్వచ్ఛంద నిష్క్రమణకు దారితీస్తాయని భావిస్తున్నామని హోం మంత్రిత్వ శాఖ కార్యాలయం తెలిపింది. పోలీస్, నేషనల్ క్రైమ్ ఏజెన్సీలు సహా భాగస్వాములు, సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని, అన్ని స్థాయిల్లోనూ అక్రమ వలసలను నిరోధిస్తామని పేర్కొన్నారు. కేవలం ఇమ్మిగ్రేషన్ నిబంధనలను ఉల్లంఘించిన వారినే కాదు. స్మగ్లింగ్ వంటి నేరాలకు పాల్పడ్డవారిని గుర్తిస్తామని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story