Russia: ప్రగోజన్ మరణించాడు

Russia: ప్రగోజన్ మరణించాడు
జన్యు పరీక్ష ద్వారా నిర్ధారించిన రష్యా

రష్యా పై తిరుగుబాటు బావుటా ఎగరేసిన కిరాయి సైన్యం అధ్యక్షుడు వాగ్నర్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ మరణించినట్లు రష్యా అధికారికంగా ధ్రువీకరించింది. ఈ మేరకు జన్యు పరీక్షల రిపోర్టును బహిర్గతం చేసింది. విమాన ప్రమాదంలో ప్రిగోజిన్ మరణించాడనే వార్తల అనంతరం దీని వెనుక రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హస్తం ఉండొచ్చన్న అనుమానాలు రేకెత్తాయి. రెండు నెలల క్రితం పుతిన్‌పై ప్రిగోజిన్ తిరుగుబాటు చేయగా.. అందుకు ప్రతీకారంగానే కుట్ర పన్ని ఆయన్ను చంపి ఉండొచ్చని పుకార్లు షికారు చేసాయి. ఈ పరిణామాల అనంతరం క్రెమ్లిన్‌ జన్యు పరీక్షలకు అనుమతినిచ్చింది.


విమాన ప్రమాద ఘటన ద్యర్యాప్తులో భాగంగా జన్యు పరీక్షలు పూర్తయ్యాయని, ఇందులో ప్రిగోజిన్ ఉన్నట్లు స్పష్టం అవుతోందని . ఆయన విమాన ప్రమాదంలో మరణించారంటూ ఇన్వెస్టిగేటివ్ కమిటీ అధికార ప్రతినిధి స్వెత్లానా పెట్రెంకో తెలిపారు.

విమాన ప్రమాదంలో వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్‌తో పాటు మరో తొమ్మిది మంది కూడా ఉన్నట్లు గుర్తించారు. ఈ తొమ్మిది మందిలో డిమిత్రి ఉట్కిన్ ఉన్నట్లు పేర్కొన్నారు. రష్యా ఇంటెలిజెన్స్‌లో పనిచేసి, ప్రస్తుతం వాగ్నర్ గ్రూప్‌ నిర్వహణలో ప్రధాన వ్యక్తిగా అయన్ను చెప్పుకుంటారు. విమాన ప్రమాదం తర్వాత రష్యా ఎయిర్ ట్రాఫిక్ ఉల్లంఘణలపై దర్యాప్తు చేపట్టింది. కానీ ఇప్పటివరకు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అలాగే ఈ విమానం కూలిపోవడానికి గల కారణాల్ని మాత్రం రష్యా అధికారులు వెల్లడించేదు.


పుతిన్‌పై తిరుగుబాటు చేసిన రెండు నెలల తర్వాత వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్.. రష్యాలోని మాస్కో నుంచి ప్రైవేట్ విమానంలో బయలుదేరగా ప్రమాదం జరిగింది. ఉన్నట్లుండి విమానం గాల్లో నుంచి కూలిపోయింది. ఈ ఘటనలో చెలరేగిన మంటల్లో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని రష్యా మీడియా వెల్లడించింది. ఇందులో ప్రిగోజిన్‌తో పాటు ఆయన అనుచరులు మొత్తం పది మంది ఉన్నారు.

మరోవైపు దీనిపై బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లూకాషెంకో స్పందించారు. ప్రమాదాలు పొంచి ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలని ప్రిగోజిన్ ను తాను రెండుసార్లు హెచ్చరించానని తెలిపారు. ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా రష్యా సైన్యం తమకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని, ఆయుధాలను కూడా తగినన్ని అందించడంలేదని వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ గత జూన్ లో ఆరోపించారు. తీవ్ర అసంతృప్తితో ప్రిగోజిన్ నాయకత్వంలో జూన్ 23న తిరుగుబాటు చేశారు.

అయితే వాగ్నర్ దళాలు మాస్కో చేరకముందే, బెలారస్ ప్రభుత్వ మధ్యవర్తిగా వ్యవహరించి రాజీ చేయడంతో తిరుగుబాటు సమసిపోయింది. మార్గ మధ్యం నుంచే వాగ్నర్ దళాలు వెనుదిరిగాయి. అప్పటినుంచి ప్రిగోజన్ అజ్ఞాతంలో ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story