Top

భారత్‌- చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు..

హోంమంత్రిత్వశాఖ, బోర్డర్‌ మేనేజ్‌మెంట్ కార్యదర్శి, ITBP, SSB అధికారులతో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు

భారత్‌- చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు..
X


భారత్‌- చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. సరిహద్దు వివాదానికి తెరదించేందుకు ఓ వైపు సంప్రదింపులు సాగుతున్నా.. డ్రాగన్‌ తోక జాడిస్తూనే ఉంది. చైనా సైన్యం హద్దు మీరితే బుద్ది చెప్పేందుకు.. భారీ ఎత్తున దళాలు, ట్యాంకులతో భారత్‌ సన్నద్ధమైంది. ఇరు పక్షాలు.. LAC వద్ద పెద్ద సంఖ్యలో మోహరించడంతో.. సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి... బార్డర్‌లో టెన్షన్‌ పెరుగుతుండటంతో... భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కోరింది. ఇండో-చైనా, భారత్‌-నేపాల్‌, భారత్‌- భూటాన్‌ సరిహద్దుల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రిత్వ శాఖ భద్రతా దళాలకు సూచించింది.

చైనా సరిహద్దుల్లో పెట్రోలింగ్ తీవ్రతరం చేయాలని హోంమంత్రిత్వ శాఖ వర్గాలు.. భద్రాతా దళాలను కోరాయి. ఉత్తరాఖండ్‌, అరుణాచల్ ప్రదేశ్‌, హిమాచల్ ప్రదేశ్‌, లద్దాఖ్‌, సిక్కిం సరిహద్దుల వద్ద అప్రమత్తంగా ఉండాలని ITBPని ప్రభుత్వం ఆదేశించింది. దీంతోపాటు ఇండియా-నేపాల్‌-చైనా ట్రై జంక్షన్‌, ఉత్తరాఖండ్‌లోని కాలాపాని ప్రాంతంలో నిఘా ముమ్మరం చేయాలని సూచించింది. హోంమంత్రిత్వశాఖ, బోర్డర్‌ మేనేజ్‌మెంట్ కార్యదర్శి, ITBP, SSB అధికారులతో జరిగిన అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

అటు.. తూర్పు లద్దాఖ్‌లోని ప్యాంగ్యాంగ్‌ త్సో ప్రాంతంలోకి చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నించిన చైనా బలగాలను... భారత సైన్యం కొద్ది రోజుల క్రితం సమర్ధంగా తిప్పికొట్టింది. LAC వెంట యథాతథ స్థితిని మార్చేందుకు చైనా విఫలయత్నం చేసిన నేపథ్యంలో.. సరిహద్దు వెంట వ్యూహాత్మక ప్రాంతాల్లో భారత సైన్యం పెద్ద ఎత్తున దళాలను మోహరించింది. ఓవైపు సైనిక చర్చలు కొనసాగుతుండగానే.. రోజు క్రితం చైనా మరో సారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఇక సరిహద్దు ప్రతిష్టంభనను తొలగించేందుకు భారత్‌- చైనాల మధ్య చుషుల్‌లో నిన్న ప్రారంభమైన బ్రిగేడ్‌ కమాండర్ స్థాయి చర్చలు కొనసాగుతున్నాయి.

డ్రాగన్ కంట్రీ దురాక్రమణపూరిత వైఖరిని.. అమెరికా మరోసారి ఎండగట్టింది. పొరుగుదేశాలపైన భారత్‌, భూటాన్‌లతోపాటు దక్షిణ, తూర్పు చైనా సముద్రంలో కావాలనే వివాదాలు సృష్టిస్తోందని అమెరికా ఆరోపించింది. చైనాపై కాంగ్రెస్‌కు అందించిన వార్షిక నివేదికలో.. పెంటగాన్‌.. ఈ వ్యాఖ్యలు చేసింది. సాయుధ ఘర్షణకు తావివ్వకుండా.. బలవంతపు వ్యూహాలను అమలు చేస్తూ... బెదిరింపులకు కుట్రపన్నుతోందని పెంటాన్‌ తెలిపింది. మరికొన్ని దేశాల్ని తమ ప్రయోజనాల కోసం వాడుకునేందుకు ఆర్థిక వనరుల్ని ఎరగా వేస్తోందని పాకిస్తాన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది.

మరోవైపు... చైనా ఈ దశాబ్దంలో తన అణ్వాయుధ సంపత్తిని రెట్టింపు చేసుకోవడానికి ప్రణాళికలు రచిస్తోందని.. అమెరికా సైనిక విభాగం వెల్లడించింది. అందులో అమెరికా వరకు వెళ్లగలిగేలా బాలిస్టిక్ మిస్సైల్స్‌ కూడా ఉన్నాయని అమెరికా పేర్కొంది. ప్రపంచ వేదికపై బలమైన శక్తిగా ఎదిగేందుకు.. 2049 వరకు ఆసియా- పసిఫిక్‌ ప్రాంతంలో అమెరికాతో సమానంగా లేదా దాన్ని అధిగమించేలా చైనా ప్రయత్నిస్తోందని అమెరికా తన నివేదికలో పేర్కొంది. అందులో భాగంగానే అణ్వాయుధ సంపత్తినపి ఆధునీకరించడంతోపాటు మరింత పెంచుకుంటోందని అమెరికా అంటోంది.

Next Story

RELATED STORIES