US Visa: భారతీయ విద్యార్థులకు రికార్డు స్థాయిలో వీసాలు జారీ చేసిన అమెరికా

US Visa: భారతీయ విద్యార్థులకు రికార్డు స్థాయిలో వీసాలు జారీ చేసిన అమెరికా
ప్రపంచవ్యాప్తంగా 6 లక్షల స్టూడెంట్ వీసాలు, 8 మిలియన్ల బిజినెస్, టూరిస్టు వీసాలు జారీ చేశామని ప్రకటన

భారతీయులకు వీసాలు జారీ చేయడంలో అమెరికా రికార్డు క్రియేట్ చేసింది. గతేడాది భారతీయ విద్యార్థులకు అత్యధిక వీసాలు జారీ చేసిన దేశంగా నిలిచింది. 2022లో ఇండియన్ స్టూడెంట్స్ కి 1,40,000 వీసాలు జారీ చేసింది. దీనికి తోడు వీసా అపాయింట్మెంట్ వెయిటింగ్ టైంను తగ్గించడానికి యూఎస్ చర్యలు తీసుకుంటోంది. భారత్ తో దౌత్యపర సంబంధాలు పెంపొందించుకునేందుకు అధ్యక్షుడు జో బైడెన్ చేస్తున్న కృషిలో భాగంగా వీసాల జారీలో ఇండియాకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.

వీసా సేవలకు సంబంధించి యూఎస్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ జూలీ స్టఫ్ట్ మాట్లాడుతూ.. భారత్‌లోని US వీసా మిషన్లు వారానికి ఆరు, ఏడు రోజులు పనిచేశాయని, విద్యార్థులు తరగతులు ప్రారంభమయ్యే ముందు ఇంటర్వ్యూలు జరిగేలా చూశాయని తెలిపారు. ఈ ఏడాది సైతం భారత్ నుంచి వస్తున్న డిమాండ్ ఆధారంగా వీసాల జారీ ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు. "గతేడాది రికార్డు స్థాయిలో వీసాలు జారీ చేయడాన్ని గర్వంగా భావిస్తున్నాను. తొలి సారిగా మిలియన్ వీసాలు జారీ చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. గతేడాదిలా పరిస్థితి కొనసాగితే ఈజీగా లక్ష్యాన్ని చేరుకుంటాం.


అమెరికా విదేశాంగ శాఖ ప్రపంచవ్యాప్తంగా 10 మిలియన్ల నాన్ ఇమిగ్రెంట్ వీసాలు జారీ చేసినట్టు కూడా ఎంబసీ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో సగానికి పైగా కార్యాలయాలు మునుపెన్నడూ చూడని స్థాయిలో నాన్ ఇమిగ్రేషన్ వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేశాయని తెలిపింది. అంతేకాకుండా, 2015 తరువాత అత్యధిక స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా 8 మిలియన్ల బిజినెస్, టూరిస్టు వీసాలు జారీ చేసినట్టు కూడా ఎంబసీ తెలిపింది. 2017 తరువాత అత్యధికంగా 6 లక్షలకు పైగా స్టూడెంట్ వీసాలు ఇచ్చినట్టు కూడా పేర్కొంది.

వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్‌ సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలతోనే ఇది సాధ్యమైందని అమెరికా ఎంబసీ పేర్కొంది. అమెరికా భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నవారికి ఎంబసీకి రావాల్సిన అవసరం లేకుండానే వీసాలు జారీ చేయడం వంటివి లాభించాయని వెల్లడించింది. భవిష్యత్తులో వీసా జారీ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story