Mission to the Moon: నువ్వా? .. నేనా ?

Mission to the Moon: నువ్వా? .. నేనా ?
చంద్రునిపైకి ముందుగా చేరేదేవరు?

చంద్రునిపై అధ్యయనానికి భారత్‌-రష్యా వేర్వేరుగా ప్రయోగించిన అంతరిక్ష నౌకలు ఒకే లక్ష్యంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఎవ్వరూ చేరని చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేయడమే వాటి టార్గెట్. అయితే భారత్‌ కంటే ముందే ఆ పని చేసిచరిత్ర సృష్టించాలని రష్యా ఉత్సాహ పడుతోంది. మన కంటే ఆలస్యంగా ప్రయోగించినా ముందే చేరాలన్నది రష్యా లక్ష్యం. అయితే రష్యా ల్యాండర్‌ అనుకున్న సమయాని కంటే ఆలస్యంగా సాఫ్ట్ ల్యాండ్‌ అయ్యే అవకాశం ఉందని ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ తన కథనంలో పేర్కొంది.

భారత్‌ చంద్రయాన్‌-3ను ప్రయోగించిన తర్వాత రష్యా,చంద్రుని దక్షిణ ధ్రువంపై తమ ల్యాండర్‌ను దించేందుకు లూనా -25 ప్రయోగాన్ని చేపట్టింది. భారత్‌ కంటే ముందే, చంద్రుడిపై ల్యాండర్‌ను దింపి ఆ ఘనత సాధించిన తొలి దేశంగా నిలవాలని రష్యా భావించింది. వేర్వేరు మార్గాల ద్వారా ఈ రెండు దేశాల అంతరిక్ష నౌకలు చంద్రుడి దక్షిణ ధ్రువం వైపు దూసుకెళ్తున్నాయి. అయితే రష్యా ల్యాండర్‌ నిర్దేశించుకున్న సమయానికి జాబిల్లిపై దిగే అవకాశాలు తక్కువే అని ప్రముఖ వార్తా సంస్థ BBC తన కథనంలో పేర్కొంది. భారత ల్యాండర్‌ స్థిరంగా నిర్దేశిత లక్ష్యం దిశగా పయనిస్తుండగా.. రష్యా మాత్రం చాలా హడావిడిగా జాబిల్లి దక్షిణ ధ్రువం వైపు పయనిస్తోందని ఆ కథనం వెల్లడించింది. నిజానికి లూనా-25ప్రయోగం 2021లో చేయాల్సి ఉండగా చాలా సార్లు వాయిదా పడి చివరికి ఇప్పుడు ప్రయోగించారు.


జాబిల్లిపైకి వ్యోమనౌకలు వెళ్లటానికి ముందు నుంచే అవి ఎన్నిరోజులు ప్రయాణించాలి, ఎప్పుడు జాబిల్లిపైకి దిగాలి అన్నది నిర్దేశిస్తారు. భారత్‌కు చెందిన చంద్రయాన్‌ 3 ల్యాండర్‌ ఈనెల 23 సాయంత్రం చంద్రుడి ఉపరితలంపై దిగనుంది. రష్యా ల్యాండర్ ఆగస్టు 21నే జాబిల్లిపై దిగనుంది. అయితే లూనా-25 చంద్రుడి ఉపరితలంపై దిగేందుకు మరికొంత సమయం పట్టవచ్చని... చంద్రయాన్-3నే మొదట చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగవచ్చని, ఈ స్పేస్‌ రేస్‌లో చంద్రయాన్-3 విజయం సాధించవచ్చని బీబీసీ పేర్కొంది.భారత్‌- రష్యా వేర్వేరుగా చేపట్టిన ప్రయోగాలు చంద్రుడిపై నీరు, ఖనిజాలు, వాతావరణాన్ని మరింత బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story