Happiest countries: ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశాలివే..

Happiest countries: ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశాలివే..
గతేడాది మాదిరిగానే 126వ స్థానంలో నిలిచిన భారత్

ప్రపంచంలో ఏయే దేశాలు అత్యంత సంతోషకరంగాఉన్నాయో తెలుసుకునేందుకు ఏటా ‘ది వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్’ కీలకమైన సర్వేను నిర్వహిస్తుంది. దీంతో ఎప్పటికప్పుడు సంతోషకరమైన దేశాల జాబితా విడుదలవుతూ ఉంటుంది. అక్కడి ప్రజలు మిగతా దేశాలతో పోలిస్తే చాలా సంతోషంగా ఉంటారని ఆ సర్వే ముఖ్య ఉద్దేశం. అయితే, అందుకు అనేక కారణాలు ఉంటాయనే సంగతి తెలిసిందే. ఎక్కడైనా మెరుగైన జీవన విధానం, ప్రజల ఆరోగ్యం, వారి భద్రత, ఉద్యోగ అవకాశాలు, జీడీపీ వంటి కీలక అంశాలు ప్రజల సంతోషానికి కారణాలుగా మిగులుతాయి. అలా మెరుగైన జీవన విధానం పాటిస్తూ ప్రజల మన్ననలు పొందిన కొన్ని దేశాలు కొంతకాలంగా టాప్‌లోనే కొనసాగుతున్నాయి.

ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలో ఫిన్‌లాండ్ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. వరుసగా ఏడవసారి 2024లో కూడా ఆ దేశం టాప్ ప్లేస్‌లో నిలిచిందని ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన తాజా రిపోర్ట్ పేర్కొంది.


నార్డిక్ దేశాలైన డెన్మార్క్, ఐస్‌లాండ్, స్వీడన్ టాప్-10 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. 2020లో తాలిబన్ నియంత్రణలోకి వెళ్లిన ఆఫ్ఘనిస్థాన్ చిట్టచివరన 143వ స్థానంలో నిలిచింది. ఇక భారత్ గతేడాది మాదిరిగానే 126వ స్థానంలో నిలిచింది. మొత్తం 143 దేశాలను పరిగణనలోకి తీసుకున్నట్టు రిపోర్ట్ పేర్కొంది. 12వ స్థానంలో కోస్టారికా, 13వ ర్యాంకులో కువైట్ నిలిచాయి. కాగా ఈ నివేదికను ప్రచురించడం మొదలుపెట్టిన తర్వాత మొట్టమొదటిసారి అమెరికా, జర్మనీ టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయాయి. యూఎస్ఏ 23వ స్థానంలో, జర్మనీలు 24వ ర్యాంకులో నిలిచాయి. ఎక్కువ జనాభా కలిగిన దేశాలు ర్యాంకింగ్స్‌లో వెనుకబడ్డాయని రిపోర్ట్ తెలిపింది.


టాప్ 10 దేశాలలో నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా దేశాలలో మాత్రమే 15 మిలియన్ల కంటే ఎక్కువ జనాభా ఉన్నారు. టాప్ 20 దేశాలలో కెనడా, యూకే మాత్రమే 30 మిలియన్లకు పైగా జనాభాను కలిగి ఉన్నాయని ఐరాస రిపోర్ట్ తెలిపింది. జీవితంపట్ల సంతృప్తి, దేశ తలసరి జీడీపీ, సామాజిక మద్దతు, ఆయుర్దాయం, స్వేచ్ఛ, దాతృత్వం వంటి అంశాల ఆధారంగా దేశాల ర్యాంకింగ్‌ను నిర్ణయించినట్టు వెల్లడించింది.

Tags

Read MoreRead Less
Next Story