ఆ లోక్‌సభ ఫలితాలపై హైకోర్టుకు వెళ్లనున్న వైసీపీ..!

ఆ లోక్‌సభ ఫలితాలపై హైకోర్టుకు వెళ్లనున్న వైసీపీ..!

గుంటూరు, శ్రీకాకుళం లోక్‌సభ ఫలితాలపై హైకోర్టుకు వెళ్లేందుకు వైసీపీ సిద్ధమవుతోంది.పోస్టల్‌ బ్యాలెట్‌లు లెక్కించకుండా ఆర్వోలు ఫలితాలు ప్రకటించారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కౌంటింగ్ జరిగిన తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోస్టల్‌ బ్యాలెట్‌ విషయంలో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయాలని నిర్ణయించారు. జగన్‌తో గుంటూరు, శ్రీకాకుళం లోక్‌సభ స్థానాల అభ్యర్థులు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, దువ్వాడ శ్రీనివాస్‌తో పాటు ఆ పార్టీ ముఖ్యనేతలు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశమై చర్చించారు. దీనిపై బుధవారం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయనున్నారు.

గుంటూరులో టీడీపీ అభ్యర్థి సుమారు 4వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందినట్లు ప్రకటించారని.. పోస్టల్‌ బ్యాలెట్ల అంశంపై అక్కడి రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మోదుగుల ఆరోపిస్తున్నారు. అక్కడ పోస్టల్‌ బ్యాలెట్లు, సర్వీసు ఓట్ల సంఖ్య దాదాపు 9వేలకు పైనే ఉందన్నారు. వాటిని లెక్కించకుండా తిరస్కరించారని.. వాటన్నింటినీ లెక్కిస్తే తన విజయం ఖాయమై ఉండేదని మోదుగుల జగన్‌ వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అలాగే శ్రీకాకుళం స్థానంలో టీడీపీ అభ్యర్థి రామ్మోహన్‌ నాయుడు 6వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతోనే గెలుపొందినట్లు ప్రకటించారని, అక్కడ కూడా సర్వీసు ఓట్లు ఎక్కువగా ఉన్నాయని.. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకోకపోవడం వల్లే అన్యాయం జరిగిందని నేతలు జగన్‌కు వివరించారు. ఈ విషయాలన్నింటినీ పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయాలని నిర్ణయించారు.

Tags

Read MoreRead Less
Next Story