జగన్ కీలక ప్రకటనలు?

జగన్ కీలక ప్రకటనలు?

ఈ నెల 30న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించనున్న ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై వైఎస్‌ జగన్‌ దృష్టి సారించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వి.సుబ్రమణ్యం, డిజిపి ఆర్పీ ఠాకూర్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు, ట్రాఫిక్‌ డిసిపి, పోలీసు అధికారులు సహా కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌, విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌ రామారావు, తదితరులు పాల్గొన్నారు.

మరోవైపు నవ్యాంధ్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జగన్ కొన్ని కీలకమైన ప్రకటనలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నవరత్నాల అమలుతోపాటు ఆర్ధికాంశాల్లో క్రమ శిక్షణ విషయమై జగన్ కీలక ప్రకటన చేయనున్నారు. ఇప్పటికే ఈ అంశాలపై మాజీ సీఎస్ అజయ్ కల్లాంతో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. అటు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా శాఖల వారీగా సంక్షిప్తంగా సమాచారాన్ని వైఎస్ జగన్‌కు అందించారు. పోలవరం ప్రాజెక్టుపై జగన్ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులో ఇప్పటివరకూ ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం ఎంత? ఇంకా కేంద్రం నుంచి ఎంత రావాల్సి ఉంది? ఎంతమేరకు పనులు పూర్తయ్యాయనే అంశాలతోపాటు అమరావతి నిర్మాణంపైనా వివరాలు అందించారు.

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శాఖల వారీగా సమీక్ష నిర్వహించడానికి జగన్ సమాయత్తమవుతున్నారు. జూన్ 1 నుంచి 5 వరకు శాఖల వారీగా జగన్ సమీక్షలు నిర్వహించనున్నారు. పూర్తిస్థాయిలో నిర్ణయాలు అమలు చేసే దిశగా ఆయన వడివడిగా అడుగులు వేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story