రేవంత్‌ రెడ్డిది గెలుపు కానే కాదు.. - కేటీఆర్

రేవంత్‌ రెడ్డిది గెలుపు కానే కాదు.. - కేటీఆర్

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తాను ఎక్కడా ఫెయిల్‌ కాలేదన్నారు కేటీఆర్. లోక్‌సభ ఫలితాలు తాము ఆశించిన విధంగా రాకపోయినా..ఓటు శాతం పెరిగిందన్నారు. కొన్ని చోట్ల ఓటమి పాలవ్వడం కేవలం తమకు తాత్కాలిక స్పీడ్ బ్రేకర్‌ లాంటిదన్నారు. మల్కాజిగిరిలో కాంగ్రెస్ గెలుపు.. గెలుపే కాదని ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఈ సారి విచిత్రమైన ట్రెండ్ కనిపించిందన్నారు కేటీఆర్. గతంలో కంటే ఓట్ల శాతం పెరిగినా 2 సీట్లు కోల్పోయామని చెప్పారు. 2014 పార్లమెంటు ఎన్నికల్లో 34 శాతం ఓట్లతో11 సీట్లు గెలిచామని, ఇపుడు ఆరు శాతం ఓట్లు ఎక్కువగా వచ్చినా 9 సీట్లే దక్కాయని మీడియా చిట్‌చాట్‌లో తెలిపారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తాను విఫలమయ్యానని అనుకోవడం లేదని స్పష్టం చేశారు. నిజామాబాద్‌లో తమ ఓటమికి కాంగ్రెస్, బీజేపీ అవగాహనే కారణమని వివరించారు. పోటీ చేసిన వారు రైతులు కాదని.. కాంగ్రెస్ కార్యకర్తలన్నారు. జగిత్యాల నియోజక వర్గంలోని ఓ కాంగ్రెస్ నేత ఇంట్లో 93 మంది నామినేషన్లు తయారయ్యాయని వివరించారు.

టీఆరెస్‌కు ఈ ఎన్నికలు పెద్ద ఎదురుదెబ్బ కాదన్నారు కేటీఆర్‌. రాహుల్ గాంధీ, దేవెగౌడ లాంటి వారే ఓడిపోయారని, కొందరు ముఖ్యనేతలు ఓడిపోతే టీఆర్‌ఎస్ కార్యకర్తల నైతిక స్థయిర్యం దెబ్బతింటున్నదనేది నిజం కాదన్నారు. అయితే తాము ఇలాంటి ఫలితాలు ఊహించలేదని, అభ్యర్థుల ఎంపిక సరిగా లేదనేది వాస్తవం కాదని స్పష్టంచేశారు . ఈ ఎన్నికల్లో గెలుపొటములకు చాలా కారణాలున్నాయని, ప్రత్యేకంగా ఇదీ అని చెప్పలేమన్నారు. మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్‌పార్టీ వెంట్రుక వాసిలో గెలుపొందిందని చెప్పారు. రేవంత్‌ రెడ్డిది ఒక గెలుపు కానే కాదన్నారు. దేశ వ్యాప్తంగా మోదీ హవా ఉన్నప్పటికీ టీఆర్‌ఎస్‌ మంచి సీట్లను గెలుచుకుందని చెప్పారు. ఆదిలాబాద్‌ ఎంపీ స్థానం బీజేపీ గెలుస్తుందని ఊహించలేదని తెలిపారు. లోక్‌సభ ఫలితాలపై వరుస ఎన్నికలు, పాలనలో జాప్యం ప్రభావం ఉందా అనే కోణంలోనూ తమ పార్టీ విశ్లేషించుకుంటుందని వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story