టీడీఎల్పీ నేతగా చంద్రబాబు ఉండ‌క‌పోతే ఆ స్థానంలో.. !

సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం తర్వాత తొలి సారి టీడీఎల్పీ భేటీ కానుంది. ఇవాళ చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో టీడీఎల్పీ నేత ఎవరు అనేది తేలనుంది. పార్టీ శాసనసభాపక్ష నేతగా చంద్ర‌బాబు ఉంటారా… లేక వేరే వారికి అవ‌కాశం క‌ల్పిస్తారా అనేది తేలిపోనుంది. అంతేకాక ఎన్నికల్లో ఓటమికి గల కారణాలు ఏంటనేది కూలంకషంగా చర్చించనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పరాజయం చవిచూసింది. కేవలం 23 స్థానాల్లో మాత్రం గెలవగలిగింది. వారిలో చంద్రబాబు సొంత సామాజిక వర్గానికి చెందిన వారే 11 మంది ఉండ‌గా… ముగ్గురు కాపులు, ఆరుగురు బిసిలు, ఒక‌రు ఎస్సీ, ఒక‌రు క్షత్రియ, ఒక‌రు వైశ్య సామాజిక ‌వ‌ర్గం వారు. అయితే బుధవారం టీడీపీ శాసనసభ పక్ష సమావేశంలో వీరిలో ఎవరిని నేతగా ఎన్నుకోబోతున్నారు అనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. మామూలుగా అయితే ఎప్పుడూ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబే ఉంటారు. కానీ ఈసారి ఫ‌లితాలు తేడాగా రావ‌డంతో ఆయ‌న ఉంటారా లేక వేరే ఎవరికైనా అవకాశం ఇస్తారా అనే చ‌ర్చ పార్టీలో జ‌రుగుతోంది. కేవలం 23 మంది ఎమ్మెల్యేలతో లీడర్ గా అసెంబ్లీలో అధికార పక్షాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే చ‌ర్చ టీడీపీలో వినిపిస్తోంది. 150 మందికి పైగా ఉన్న అధికార పక్ష ఎమ్మెల్యేలు ప్రతి సందర్భంలోనూ చంద్రబాబును టార్గెట్ చేసే అవకాశం ఉంది. దీనివల్ల సభలో చర్చలు కూడా పక్కదారి పట్టే అవకాశం ఉంది. అందువల్ల ఈ సారి చంద్ర‌బాబే టీడీఎల్పీ నేత‌గా ఉంటారా లేక వేరే ఎవ‌రినైనా ఆ స్దానంలో ఉంచుతారా అనేది ఆస‌క్తిగా మారింది.

టీడీఎల్పీ నేతగా ఒక‌వేళ చంద్రబాబు ఉండ‌క‌పోతే ఆ స్దానంలో ఎవ‌రు ఉంటారు అనేది బుధవారం సమావేశంలో తేలనుంది. ఎన్నికల్లో గెలిచిన 23 మందిలో చాలా మంది సీనియ‌ర్ నేతలు ఉన్నారు. క‌ర‌ణం బ‌ల‌రామ్‌, గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి, అచ్చెన్నాయుడు, నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప‌, గంటా శ్రీ‌నివాస‌రావు వంటి సీనియ‌ర్ నేత‌లు ఉన్నారు. బీసీ వర్గాలకు ఆ పదవి ఇవ్వాలనుకుంటే అచ్చన్న కరెక్ట్ అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. లేదా కాపు వర్గానికి చెందిన వారికి ఇవ్వాల‌నుకుంటే చినరాజప్ప పేరు వినిపిస్తోంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావు అయితే ఎలా ఉంటుంది అనే చర్చ కూడా జరుగుతోంది. కమ్మ సామాజిక వర్గం నుండి చూసుకుంటే కరణం బలరాం, గోరంట్ల బుచ్చయ్య చౌదరి ల పేర్లు వినిపిస్తున్నాయి. టీడీఎల్పీ నేత విషయం అలా ఉంచితే సార్వత్రిక ఓట‌మి ఫ‌లితాల‌పై భేటీలో సుధీర్గ చ‌ర్చ జ‌ర‌గ‌నుంది. ఫ‌లితాల‌పై నేత‌ల అభిప్రాయం చంద్ర‌బాబు తీసుకోనున్నారు. దీని ఆధారంగానే భ‌విష్య‌త్ కార్య‌చ‌ర‌ణ రూపొందించుకోనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story