ఆంధ్రప్రదేశ్

కీలక నిర్ణయం తీసుకున్న టీడీపీ ఎమ్మెల్యేలు

కీలక నిర్ణయం తీసుకున్న టీడీపీ ఎమ్మెల్యేలు
X

ఏపీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిన టీడీపీ.. ఇప్పుడిప్పుడే ఆ ఓటమిని జీర్ణించుకుంటోంది. అసెంబ్లీ ఫలితాల తర్వాత తొలిసారిగా సమావేశమైన టీడీపీ ఎమ్మెల్యేలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీడీపీ ఎల్పీ నేతగా ఎవరుంటారనే ఉత్కంఠకు ఆ పార్టీ నేతలు తెరదించారు. తమ అధినేత చంద్రబాబునే ఆరోసారి టీడీఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఉండవల్లిలో జరిగిన సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చంద్రబాబు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో జగన్‌ ఆహ్వానంపైనా సుదీర్ధంగా చర్చ జరిగింది. కేసీఆర్ ఇంటికి నేరుగా వెళ్లిన జగన్.. చంద్రబాబుకు ఫోన్లో ఆహ్వానం పంపటాన్ని ఎమ్మెల్యేలు తప్పుబట్టారు. రాజ్‌భవన్‌లో అయితే వెళ్లొచ్చని, కానీ బహిరంగ ప్రమాణస్వీకారం కాబట్టి వద్దని నేతలు వారించారు. దీంతో ప్రమాణస్వీకారానికి వెళ్లకున్నా.. అభినందనలు తెలుపాలని నిర్ణయించారు. పయ్యావుల, అచ్చెన్నాయుడు, గంట శ్రీనివాస్‌రావుతో కూడిన ఓ బృందం ఇవాళ జగన్‌ను కలిసి… చంద్రబాబు తరపున శుభాకాంక్షలు తెలపనుంది.

ఇక టీడీఎల్పీ ఉపనేత, విప్‌ల ఎంపికపైనా ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశంపై తుది నిర్ణయాన్ని చంద్రబాబుకే అప్పగించారు ఎమ్మెల్యేలు. ఈ భేటీలో టీడీపీ పార్లమెంటరీ పక్ష నేతగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ను నియమించారు. అలాగే లోక్‌సభ పార్టీ నేతగా శ్రీకాకుళం రామ్మోహన్‌నాయుడు, రాజ్యసభలో నేతగా ఎంపీ సుజనా చౌదిరిని ఎంపిక చేశారు. అలాగే విజయవాడలో తెలుగుదేశం పార్టీ తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

పార్టీ ఓటమిపై విశ్లేషించుకున్నారు టీడీఎల్పీ సభ్యులు. భవిష్యత్తు పోరాటాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రజల కోపంతో టీడీపీ ఓడిపోలేదన్న చంద్రబాబు జగన్ సానుభూతి వల్లే వైసీపీ గెలిచిందన్నారు. కాలంతో పరిగెత్తి మరీ కష్టపడ్డాం కానీ, ప్రజల అంచనాలు మరోలా ఉన్నాయన్నారు. కొత్త ప్రభుత్వం ఏం చేస్తుందో చూసి.. నిశితంగా పరిశీలించి పోరాడుదామని సభ్యులకు సూచించారు. నియోజకవర్గాల వారిగా ప్రజల సమస్యలపై సమర్ధవంతంగా పోరాడుదామన్నారు. ఒక సీటుతో ప్రస్థానం ప్రారంభించిన టీఆర్‌ఎస్..రెండు సార్లు అధికారంలోకి వచ్చిందని.. ధైర్యం కోల్పోవద్దని చంద్రబాబు నేతలతో అన్నారు.

Next Story

RELATED STORIES