కేసీఆర్, జగన్ విమానానికి నో పర్మిషన్

కేసీఆర్, జగన్ విమానానికి నో పర్మిషన్

ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం ఢిల్లీలో వైభవంగా జరిగింది. దేశవిదేశాలకు చెందిన ఎందరో ప్రముఖులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. అయితే తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రుల పర్యటన మాత్రం ఆకస్మికంగా రద్దయింది. నరేంద్ర మోదీ తన ప్రమాణ స్వీకారానికి క్రీడాకారులు, వాణిజ్యవేత్తలు, దేశవిదేశాలకు చెందిన ఎందరో ప్రముఖులకు ఆహ్వానాలు పంపారు. అలాగే ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలతో పాటు మన దేశంలోని ముఖ్యమంత్రులను ఆహ్వానించారు. కొందరు వెళ్లారు. మరికొందరు గైర్హాజరయ్యారు. కానీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ ఢిల్లీ పర్యటన అనుకోకుండా రద్దయింది.

ఏపీ సీఎంగా జగన్ విజయవాడలో ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం జగన్, కేసీఆర్ ఇద్దరూ ఒకే విమానంలో ఢిల్లీ వెళ్లాలనుకున్నారు. అయితే మూడున్నర గంటల తర్వాత షెడ్యూల్‌లో లేని ప్రత్యేక విమానాలు ఢిల్లీలో దిగేందుకు డీజేసీఏ, పౌర విమానాల శాఖ అనుమతులను రద్దు చేసింది.

జగన్ ప్రమాణ స్వీకారం పూర్తయ్యేసరికి ఆలస్యమైంది. దీంతో జగన్, కేసీఆర్ విమానానికి డీజేసీఏ అనుమతి ఇవ్వకపోవడంతో వారి ఢిల్లీ పర్యటన రద్దయింది. ఢిల్లీ పర్యటన రద్దు కావడంతో.. సీఎం కేసీఆర్‌… విజయవాడ నుంచి హైదరాబాద్‌ చేరుకున్నారు.

Tags

Next Story