వచ్చే వారం నుంచి ఏపీ అసెంబ్లీ..ప్రొటెం స్పీకర్‌గా..
ఈ నెల 12వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ తొలి సమావేశాలు జరగనున్నాయి. ఐదు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో నూతనంగా ఎన్నికైన 175 మంది, అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రొటెం స్పీకర్ సభ్యుల చేత ప్రమాణస్వీకారం చేయిస్తారు. అనంతరం స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. అయితే ప్రొటెం స్పీకర్‌గా స్పీకర్ ఎవరనేదానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. సంప్రదాయంగా సీనియర్ నేత ప్రొటెం స్పీకర్‌గా ఉంటారా లేక అధికార పార్టీ నుంచి ఎవరైన ఆ స్థానంలో ఉంటారా అనేది తెలియాల్సి ఉంది. కాగా సమావేశాలు ప్రారంభానికి ముందే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన మంత్రివర్గాన్ని విస్తరించబోతున్నారు.
ఈ నెల 8వ తేదీ ఉదయం సీఎం జగన్ సచివాలయంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అదే రోజున మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం సచివాలయంలో జరుగుతుంది. మంత్రివర్గ విస్తరణకు ఒక రోజు ముందుగా 7వ తేదీన వైఎస్సార్ ఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి.. మంత్రివర్గ కూర్పుపై చర్చించనున్నారు.
కొత్త మంత్రులతో ఏర్పడబోయే మంత్రివర్గ సమావేశం ఈ నెల 10వ తేదీన జరుగనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో 12 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ తొలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రభుత్వ పరంగా ప్రజలకు చేయాల్సిన దిశానిర్దేశం వంటి అంశాలపై చర్చించనున్నారు. తమ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలపడంతో పాటుగా వారికి ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి అసెంబ్లీలో సీఎం జగన్ కీలక ప్రకటనలు చేయనున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com