ఆ వేదికను చంద్రబాబు అధికారిక నివాసంగా మార్చండి : టీడీపీ

పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు టీడీపీ అధినేత చంద్రబాబు. అమరావతిలో ఆ పార్టీ ముఖ్యనేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయి నుంచి కొత్త నాయకత్వాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలన్నదానిపై చర్చించినట్లు తెలుస్తోంది.

అమరావతిలో పార్టీ ముఖ్య నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. పార్టీ బలోపేతం, తాజా రాజకీయ పరిణామాలపై నేతలతో చర్చించారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో పార్టీ ఘోర పరాజయంపాలైన నేపథ్యంలో క్షేత్రస్థాయి నుంచి పార్టీని ఎలా ప్రక్షాళన చేయాలి? నూతన నాయకత్వాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి? ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీకి పార్టీ సీనియర్‌ నేతలు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, చినరాజప్ప, కళా వెంకట్రావు, సోమిరెడ్డి, పలువురు ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు గల్లా జయదేవ్‌, కేశినేని నాని హాజరయ్యారు.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలపై దాడులు విషయంలో ఆందోళన వ్యక్తం చేశారు నేతలు. తెలంగాణకు ఏపీ భవనాలు అప్పగించడంపైనా చర్చ జరిగింది. ఏకపక్షంగా ఏపీ ఆస్తుల్ని అప్పగించారంటూ కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే పాలన వ్యవహారాలపై అప్పడే విమర్శలు చేయడం మంచిది కాదని మరికొందరు సూచించారు.ఇక ప్రజావేదికను ప్రతిపక్షనేత అధికార నివాసంగా కేటాయించాలని టీడీపీ కోరనుంది. పార్టీ కార్యక్రమాలకు విజయవాడలో మరో భవనం పరిశీలించాలని నేతలకు సూచించారు చంద్రబాబు. జిల్లా కమిటీల స్థానంలో పార్లమెంటరీ కమిటీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు లోక్‌సభలో టీడీపీ ఉపనేత, పార్టీ విప్‌గా కేశినేని నాని, రాజ్యసభలో ఫ్లోర్‌ లీడర్‌గా సీఎం రమేష్‌ను ఎన్నుకున్నారు.

మరోవైపు ఈ నెల 7 నుంచి చంద్రబాబు కొద్ది రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈలోగా పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, తదితర అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.

Tags

Next Story