వారితోనే భారత్‌కు గట్టి పోటీ..ఇక ఆ మూడు మ్యాచ్‌లు గెలిస్తే..

వారితోనే భారత్‌కు గట్టి పోటీ..ఇక ఆ మూడు మ్యాచ్‌లు గెలిస్తే..

ప్రపంచకప్‌ను ఘనంగా ఆరంబించిన టీమిండియాకు తర్వాతి మ్యాచ్‌లు సవాల్‌ విసురుతున్నాయి. వచ్చే 10 రోజుల్లో కోహ్లీసేన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ , పాకిస్థాన్‌లతో తలపడబోతోంది. వరుసగా ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే భారత్‌ సెమీస్‌కు చేరువైనట్టే.అంచనాలు తప్పలేదు... ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లో టీమిండియా అనుకున్నట్టుగానే సౌతాఫ్రికాను చిత్తు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్‌ విభాగాల్లో అదిరిపోయే ప్రదర్శన కనబరిచింది. టైటిల్ రేసులో ముందున్న కోహ్లీసేనకు ఈ విజయం ఖఛ్చితంగా జోష్ పెంచుతుందనడంలో సందేహం లేదు.

అయితే తర్వాతి మ్యాచ్‌లలోనూ ఇదే ఆటతీరు కొనసాగించాల్సి ఉంటుంది. ఎందుకంటే రానున్న 10 రోజుల్లో టీమిండియా టాప్ టీమ్స్‌తో తలపడబోతోంది. ఆదివారం ఆస్ట్రేలియాతో తలపడనుండగా... వచ్చే వారం వరుసగా న్యూజిలాండ్ , చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ జట్లతో మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ మూడు మ్యాచ్‌లూ కోహ్లీసేనకు సవాల్ విసిరేవే. ఆదివారం ఆసీస్‌తో పోరుతోనే సవాల్ మొదలు కాబోతోంది. ఈ ప్రపంచకప్‌లో టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకటిగా ఉన్న ఆసీస్‌ను ఓడించాలంటే భారత్ స్థాయికి తగినట్టు ఆడాల్సిందే. ఐపీఎల్‌కు ముందు సొంతగడ్డపైనే భారత్‌ను నిలువరించి వన్డే సిరీస్ గెలుచుకున్న ఆసీస్‌ కూడా మంచి ఫామ్‌లోనే ఉంది. ఏడాది నిషేధం తర్వాత జట్టులోకి వచ్చిన వార్నర్, స్మిత్‌లతో ఆ జట్టు మరింత బలపడింది. దీంతో అత్యంత పటిష్టంగా ఉన్న కంగారూలను నిలువరించడం భారత్‌ ముందున్న తొలి సవాల్‌

వచ్చే వారం జరిగే మరో మ్యాచ్‌లో టీమిండియా, న్యూజిలాండ్‌తో తలపడబోతోంది. ప్రపంచకప్‌ ఎప్పుడు జరిగినా న్యూజిలాండ్‌పై అంచనాలుంటాయి. టోర్నీలో ఇప్పటికే రెండు విజయాలు అందుకున్న కివీస్‌ భారత్‌కు గట్టిపోటీ ఇచ్చే అవకాశాలున్నాయి. వన్డేల్లో నిలకడగా రాణించే టేలర్, విలియమ్సన్ లాంటి సీనియర్లతో పాటు పలువురు ఆల్‌రౌండర్లకు ఆ జట్టుకు బలం. దీంతో కివీస్‌తో పోరు కూడా కోహ్లీసేన తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు.

ఇదిలా ఉంటే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జూన్ 16న తలపడబోతోంది. ఈ ప్రపంచకప్‌లో అత్యంత క్రేజ్ ఉన్న మ్యాచ్‌ ఇదే. పాకిస్థాన్‌తో మ్యాచ్‌ అంటే వరల్డ్‌వైడ్‌గా ఉండే క్రేజ్‌తో పాటు ఆటగాళ్ళపై ఎంతో ఒత్తిడి ఉంటుంది. అయితే ప్రస్తుత ఫామ్‌,గత రికార్డులు చూస్తే భారత్‌నే ఫేవరెట్‌గా చెబుతున్నప్పటకీ... ఎప్పుడెలా ఆడుతుందో తెలియని పాక్‌ను తేలిగ్గా తీసుకోలేమన్నది ప్రత్యకంగా చెప్పక్కర్లేదు. తొలి మ్యాచ్‌లో 106 పరుగులకే కుప్పకూలిన పాక్ తర్వాత ఆతిథ్య ఇంగ్లాండ్‌కు షాకిచ్చింది. దీంతో పాక్‌తో పోరు కూడా భారత్‌కు గట్టి సవాలే. ఓవరాల్‌గా ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా గెలిస్తే... సెమీస్‌కు చేరువైనట్టేనని చెప్పొచు. సెకండాఫ్‌లో జరిగే లీగ్ మ్యాచ్‌లలో ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్‌, శ్రీలంక ఉండడంతో సులువుగానే విజయాలు సాధించే అవకాశముంది. దీంతో వచ్చే 10 రోజుల్లో జరిగే మూడు మ్యాచ్‌ల్లో కోహ్లీసేన అత్యుత్తమ ఆటతీరు కనబరచాల్సి ఉంటుంది.

Tags

Next Story