నీచులు.. పదివేల కోసం పసిపాపని..

నీచులు.. పదివేల కోసం పసిపాపని..

కడుపుకి అన్నం తింటున్నారో గడ్డి తింటున్నారో.. ముక్కుపచ్చలారని మూడేళ్ల చిన్నారిని చంపడానికి చేతులు ఎలా వచ్చాయో. తీసుకున్న పదివేల రూపాయల అప్పు తీర్చలేదన్న కారణంగా పాపం పసిపాని అతి దారుణంగా చంపేశారు. మనుషులన్న విషయాన్ని మరిచి పోయి మృగాల్లా వ్యవహరించారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్‌లో జరిగింది. తప్పాల్ ఏరియాకు చెందిన భన్వారీ లాల్ శర్మ రోజూ కూలికి వెళుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అతడికి భార్య, మూడేళ్ల కూతురు ట్వింకిల్ ఉన్నారు. భన్వారీ లాల్ తండ్రికి సుస్తీ చేయడంతో ఆసుపత్రిలో చూపించడానికి డబ్బు లేక రూ.10 వేలు ఓ వ్యక్తి దగ్గర నుంచి అప్పుగా తీసుకున్నాడు.

ఈ మధ్య అప్పిచ్చిన వ్యక్తి వచ్చి డబ్బు ఇమ్మని అడిగాడు. కొంత చెల్లించిన భన్వారీ లాల్ మిగిలిన సొమ్ముని కొద్ది రోజుల్లో చెల్లిస్తానన్నాడు. 15 రోజుల తరువాత మళ్లీ వచ్చాడు అప్పిచ్చిన వ్యక్తి డబ్బు కావాలంటూ. కొన్ని రోజులు గడువు ఇవ్వు తీర్చేస్తానన్నా వినకుండా.. డబ్బివ్వకపోయావో అంతు చూస్తానంటూ వెళ్లి పోయాడు. ఇది ఇలా ఉండగా మే 31న భన్వారీలాల్ కూతురు ట్వింకిల్ కనిపించకుండా పోయింది. దీంతో పరిసర ప్రాంతాల్లో వెదికిన కుటుంబసభ్యులకు పాప ఆచూకీ దొరక్క పోవడంతో అనుమానంతో పోలీసులను ఆశ్రయించారు.

పోలీసులు కిడ్నాప్ కేసు కింద నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులకు మూడు రోజుల తరువాత స్థానికుల నుంచి సమాచారం అందింది. ఓ పాప మృతదేహాన్ని కుక్కలు పీక్కుతింటున్నాయని చెప్పారు. దాంతో అక్కడికి చేరుకున్న పోలీసులు పాప మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పాపని ట్వింకిల్‌గా గుర్తించిన పోలీసులు పాప తల్లిదండ్రులకు సమాచారం అందించారు. చిన్నారి కళ్లు, భుజంతో పాటు పొట్టభాగాన్ని అప్పటికే కుక్కలు పీక్కుతిన్నాయి.

ముద్దు ముద్దు మాటలు పలుకుతూ ఇల్లంతా సందడి చేసే తమ చిన్నారిని ఆ స్థితిలో చూసిన తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. అప్పిచ్చిన వాడే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని పోలీసులకు వివరించారు. బంగారం లాంటి బిడ్డని పొట్టన పెట్టుకున్నారని గుండెలు బాదుకుంటున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పాపను హత్య చేసిన జాహిద్‌తో పాటు అతడికి సహకరించాడన్న అనుమానంతో అస్లాం అనే మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు.

చిన్నారి ట్వింకిల్ హత్యోదంతంపై బాలీవుడ్ ప్రముఖులు స్పందించారు. పసిబిడ్డ ప్రాణాలు తీయడానికి చేతులు ఎలా వచ్చాయి. ఇలాంటి వాళ్లు సమాజంలో ఉండడానికి అర్హులు కాదు. వారిని వెంటనే ఉరి తీయాలంటూ రవీనా టాండన్ పోస్ట్ పెట్టారు. ఈ ఘటనపై ఎలా స్పందించాలో కూడా అర్థం కావట్లేదు. అసలు వారు మనుషులేనా.. మృగాల్లా ప్రవర్తించారంటూ అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేశారు. ఇలాంటి నేరాలు మళ్లీ మళ్లీ జరక్కుండా నిందితులను కఠినంగా శిక్షించేలా చట్టాలు మార్చాలన్నారు సిద్దార్థ్ మల్హోత్రా.

Tags

Read MoreRead Less
Next Story