వాళ్ళతో మ్యాచ్ అంత ఈజీ కాదు.. ఆ జట్టే భారత్‌కు అసలు సవాల్

ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లో సౌతాఫ్రికాను ఓడించిన టీమిండియా రెండో మ్యాచ్‌కు సిధ్ధమైంది. టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకటైన ఆస్ట్రేలియాతో తలపడబోతోంది. నిజానికి సఫారీలతో మ్యాచ్‌లో కోహ్లీసేనకు పెద్దగా పోటీ ఎదురుకాలేదు. భారత బౌలర్లు సమిష్టిగా రాణించి సౌతాఫ్రికాను తక్కువ స్కోర్‌కే కట్టడి చేశారు. తర్వాత ఛేజింగ్‌లో కాస్త తడబడినా... రోహిత్‌శర్మ సెంచరీతో మ్యాచ్‌ను గెలుచుకుంది. అయితే ఆసీస్‌తో మ్యాచ్ మాత్రం అంత సులువుగా ఉండే పరిస్థితి లేదు. ఒకప్పటి ఆసీస్‌లా ఆ జట్టును చూసి కంగారుపడే పరిస్థితి లేకున్నా... తేలిగ్గా తీసుకుంటే మాత్రం మూల్యం చెల్లించుకోవాల్సిందే. బాల్ టాంపరింగ్ వివాదంతో మసకబారిన ఆసీస్ వరల్డ్‌కప్‌కు ముందు భారత గడ్డపై సిరీస్ గెలుచుకున్న విషయం ఎవ్వరూ మరిచిపోలేదు. స్మిత్,వార్నర్ లేకున్నా... సొంతగడ్డపై భారత్‌ను నిలువరించిన ఆసీస్ ప్రస్తుతం వరల్డ్‌కప్‌లో ఫేవరెట్‌గా దూసుకెళుతోంది. ఇప్పుడు స్మిత్,వార్నర్ ఎంట్రీతో మరింత బలపడిన ఆ జట్టు టీమిండియాకు సవాల్ విసరడం ఖాయం.
ప్రస్తుత వరల్డ్‌కప్‌లో వరుసగా రెండు విజయాలను అందుకున్న ఆసీస్.. విండీస్‌పై ఛాంపియన్ ఆటతీరుతో ఆకట్టుకుంది. 89 పరుగులకే సగం వికెట్లు చేజార్చుకున్నా... తర్వాత అద్భుతంగా పుంజుకుని కరేబియన్ టీమ్‌ను నిలువరించింది. విండీస్‌పై తడబడినంత మాత్రాన ఆసీస్ బ్యాటింగ్‌ను తక్కువ అంచనా వేయలేం. ముఖ్యంగా మన బౌలింగ్‌పై మంచి అవగాహన ఉన్న వార్నర్, స్మిత్, మ్యాక్స్‌వెల్‌ను కట్టడి చేయడం పైనే భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. అటు ఇంగ్లాండ్ పిచ్‌లు బౌలింగ్‌కు సహకరిస్తున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా బౌలర్లతో మన బ్యాట్స్‌మెన్ జాగ్రత్తగా ఉండాల్సిందే. సామర్థ్యానికి తగ్గట్లు ఆడితేనే కంగారూలను కోహ్లీసేన ఓడించగలదు. సఫారీలపై నిరాశపరిచిన ధావన్, కోహ్లీ ఆసీస్‌పై బ్యాట్‌కు పనిచెప్పాల్సిందే. ఇదే సమయంలో ప్రపంచకప్ అనగానే చక్కటి వ్యూహాలతో బరిలోకి దిగే ఆసీస్‌ను ఓడించేందుకు టీమిండియా కూడా ప్లానింగ్‌తోనే సిధ్ధమవుతోంది. రెండో మ్యాచ్‌లో కంగారూలను ఓడిస్తే టోర్నీలో భారత్ జోరుకు బ్రేక్ వేయడం కష్టమే. ఒకవేళ కంగారూల చేతిలో ఓడితే మాత్రం ఒత్తిడిలో పడటం ఖాయం. ముఖ్యంగా పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు ఓటమి ఏమాత్రం జట్టుకు మంచిదికాదు. అటు రికార్డుల పరంగా మాత్రం ఆసీస్‌దే పైచేయిగా ఉంది. ప్రపంచకప్‌లో ఇప్పటివరకూ 11 మ్యాచ్‌లలో తలపడితే 8 సార్లు ఆసీస్ గెలవగా...3 సార్లు మాత్రమే భారత్ విజయం సాధించింది. ప్రస్తుత ఫామ్ ప్రకారం ఇరు జట్లూ సమ ఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. ఏదేమైనా కోహ్లీసేన తొలి మ్యాచ్‌ను మించిన ఆటతీరుతో కంగారూల్ని మట్టికరిపించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
- నరేష్
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com