జగన్ సీఎం అయ్యాక తొలిసారిగా మోదీ...
ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ తిరుమలేశున్ని దర్శించుకోనున్నారు. శ్రీవారి దర్శనం కోసం కాసేపట్లో తిరుపతికి చేరుకోనున్నారు. విదేశీ టూర్‌లో భాగంగా శ్రీలంకలో పర్యటిస్తున్న మోదీ అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో 4 గంటల 30 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రాయానికి చేరుకుంటారు. ప్రోటోకాల్ మేరకు ప్రధాని మోదీకి ఎయిర్‌పోర్టులో గవర్నర్ నరసింహన్..సీఎం జగన్ స్వాగతం పలకనున్నారు. వీరితో పాటు కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపి జీవీఎల్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రధాని మోదీకి సాదర స్వాగతం పలకనున్నారు.
తిరుమల దర్శనానికి ముందు ప్రధాని మోదీ..బీజేపీ శ్రేణులతో ఇంటరాక్ట్ కానున్నారు. ఏపీలో బీజేపీ బలోపేతం, ఆనుసరించాల్సిన వ్యూహాలపై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయన్నారు. కార్బన్ సెల్ కంపెనీ గ్రౌండ్‌లో జరిగే సభలో ప్రధాని పాల్గొని ప్రసంగిస్తారు. మోదీ పర్యటనతో తిరుపతి పట్టణం కాషాయమంగా మారిపోయింది. బ్యానర్లతో ఘనస్వాగతం పలుతున్నారు బీజపీ నాయకులు. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా మోదీ ఏపీలో అడుగుపెడుతున్నారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యల పరిష్కారంపై జగన్ దృష్టి సారించారు. . ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా ఇవ్వాలని, తక్షణ సాయంగా అవసరమైన నిధులు అందజేయాలని జగన్ ప్రధాని మోడీని కోరనున్నట్లు తెలుస్తోంది.
సభా ప్రాంగణం నుంచి రోడ్డు మార్గం ద్వారా తిరుమలలోని పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారు ప్రధాని మోదీ.. అక్కడ టీటీడీ ఉన్నతాధికారులు ప్రధానికి స్వాగతం పలుకుతారు. కాసేపు విరామం అనంతరం అక్కడి నుంచి స్వామివారి దర్శనానికి బయలుదేరుతారు. ఆలయ మహాద్వారం చేరుకున్నాక..ప్రధానికి వేదపండితులు స్వాగతం పలుకుతారు. రాత్రి 7గంటల సమయంలో స్వామివారిని దర్శించుకోనున్నారు ప్రధాని. స్వామిదర్శనం అనంతరం తిరిగి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రాత్రి 8గంటల ప్రాంతంలో విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళుతారు. మోదీకి వీడ్కోలు పలికాక గవర్నర్, సీఎం జగన్ కూడా అక్కడి నుంచి తిరుగుపయానం అవుతారు.
ప్రధాని మోదీ తిరుమల పర్యటన నేపథ్యంలో భద్రతా కట్టుదిట్టం చేశారు. అడుగడునా నిఘా పెంచారు. తిరుపతి, తిరుమలో భారీగా పోలీసుల, భద్రతా దళాలు మోహరించాయి. తిరుమల కొండపైన మోదీ విశ్రాంతి తీసుకునే పద్మావతి అతిథి గృహాన్ని ఇప్పటికే ఎస్పీజీ అధీనంలోకి తీసుకుంది. సమీప ప్రాంతాల్లో ఉన్న రెస్ట్ హౌస్‌లను యాత్రికులకు కేటాయించడాన్ని ఆపేశారు. అలిపిరి నుంచి శ్రీవారి ఆలయం వరకు, అడుగడుగునా పోలీసులు మోహరించారు. ఘాట్ రోడ్డులో కూంబింగ్, బాంబ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు. ప్రధాని పర్యటన మార్గాల్లోని దుకాణాలన్నీ మూసివేయాలని ఇప్పటికే వ్యాపారస్తులకు ఆదేశించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com