ముఖ్యమంత్రి హోదాలో జగన్ తొలిసారిగా..
వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇవాళ ఏపీ కేబినెట్ తొలిసారి భేటీ కానుంది. ఉదయం 10.30 నిమిషాలకు సచివాలయంలో మంత్రి వర్గ సమావేశం ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరగనున్న తొలి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. మేనిఫెస్టోలో పెట్టిన నవరత్నాల అమలే లక్ష్యంగా మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ముఖ్యంగా వృద్ధాప్య పింఛన్లు 2 వేల 250 రూపాలయకు పెంపు, ఆశా వర్కర్లకు 3 వేల నుంచి 10 వేలకు పెంపు, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, మున్సిపల్ పారిశుధ్యం కార్మికులు, హోంగార్డు జీతాల పెంపు, అక్టోబరు నుంచి రైతు భరోసా అమలు, ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్, సీపీఎస్ రద్దు లాంటి కీలక అంశాలపై మంత్రి వర్గం చర్చించనుంది. ముఖ్యమంత్రి హోదాలో జగన్ తొలిసారిగా కెబినెట్ భేటీ నిర్వహించనున్నారు.
అంతే కాదు ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కేటాయింపు పాలసీతో పాటు పెన్షన్ల పెంపు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు చెందిన సమస్యలపైన కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. రైతులకు పెట్టుబడి నిధి ఇస్తామని, ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని జగన్ ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ అమలుకు వేగంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే రైతు భరోసా కింద అక్టోబర్ 15 నుంచి ప్రతి రైతుకు 12 వేల 500 రూపాయలు చెల్లించనున్నారు. దీనిపైనా కేబినెట్‌లో సుధీర్ఘంగా చర్చించనున్నారు.
సీపీఎస్ రద్దుచేయాలంటూ గత కొన్నేళ్లుగా ఉద్యోగులు ఉద్యమాలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో కూడా సీపీఎస్‌ను రద్దు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సీపీఎస్ రద్దుపై కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. సీపీఎస్ రద్దు సాధ్యమేనా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఇప్పటికే సీపీఎస్ రద్దుపై ఏర్పాటు చేసిన కమిటీ ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. సీపీఎస్ రద్దు వల్ల ప్రభుత్వానికి వచ్చే లాభమేమి ఉండదని.. అదనపు భారం తప్పదని తేల్చి చెప్పింది. గత ప్రభుత్వాలు కూడా సీపీఎస్ రద్దుకు సాహసం చేయలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సీపీఎస్ రద్దుకే మొగ్గు చూపుతుందా? పాత పెన్షన్ విధానాన్నే తీసుకొచ్చి ఉద్యోగులకు మేలు చేస్తుందా? అన్నది చూడాల్సి ఉంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com