మొక్కు చెల్లించుకొని తిరిగి వస్తుండగా..
ఏపీలో ఎన్నికల వేడి చల్లారలేదు. పలుగ్రామాల్లో ఘర్షణ వాతావరణం కొనసాగుతూనే ఉంది. తూర్పుగోదావరి జిల్లా బి. కొత్తూరులో వైసీపీ , టీడీపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడులకు దిగారు. ఈ ఘర్షణలో గాయపడ్డ వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఎన్నికల నాటి నుంచి ఈగ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటు కొనసాగుతోంది.
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో రాజుకున్న వేడి ఇంకా చల్లారడం లేదు. పలు గ్రామాల్లో వైసీపీ , టీడీపీ వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం, బి కొత్తూరులో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరువర్గాలు పరస్పరం కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో 13 మందికి గాయాలు అయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. అంతటితో ఆగకుండా ఆస్పత్రి వద్ద ఇరువర్గాలు మరొసారి బాహాబాహీకి దిగారు. దీంతో తీవ్ర ఉద్రికత్త పరిస్థితి ఏర్పడింది. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
బి.కొత్తూరులో ఒక వర్గానికి చెందిన వారు చేబ్రోలులోని సత్తెమ్మతల్లి గుడి వద్ద మొక్కు చెల్లించుకొని తిరిగి వస్తుండగా.. మరో వర్గం ఎదురైంది. దీంతో టీడీపీ, వైఎస్సార్‌సీసీ మద్దతుదారుల మధ్య వాగ్వివాదం జరిగింది. ఆ ఘర్షణ కాస్త ముదరడంతో ఇరు వర్గాలకు చెందినవారు కర్రలతో విచక్షణా రహితంగా కొట్టుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కాకినాడ డీఎస్పీ రవివర్మ ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి బి.కొత్తూరులో టీడీపీ, వైఎస్సార్‌సీపీ వర్గీయుల మధ్య వివాదాలు జరుగుతున్నాయి. ఎన్నికల తర్వాత రోజు ఘర్షణ జరిగింది. నాటి నుంచి గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. అయినప్పటికీ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఘర్షణ నేపథ్యంలో ప్రధాన కూడళ్లలో పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు. అదనపు పోలీసు బలగాలను మోహరించారు. ఎప్పుడు ఏం జరుగుతుందోననే అందోళనతో గ్రామస్థులు ఉన్నారు..
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com