అక్కా అని పిలిచి బండి ఎక్కమన్నాడు.. ఆపై
ముక్కూ మొహం తెలియని వ్యక్తి అక్కా అని ఆప్యాయంగా పిలిచేసరికి ఆనందపడిపోయింది. కానీ ఆ పిలుపు వెనుక ఉన్న పాడుబుద్దిని గ్రహించలేకపోయింది. ఆటోని రాంగ్ రూట్లోకి పోనిచ్చేసరికి.. వీడేదో దుర్బుద్ధితో ఉన్నాడని తలచి వెంటనే మేల్కొంది. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం గొడవర్రు గ్రామానికి చెందిన ఓ యువతి కంకిపాడుఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. బుధవారం రాత్రి డ్యూటీకి వెళ్లేందుకు ఆటోకోసం ఎదురు చూస్తోంది. ఇంతలో అదే గ్రామానికి చెందిన చోరగుడి రవీంద్ర ఆమె వద్దకు వచ్చాడు. అక్కా నేను కూడా కంకిపాడు వెళుతున్నా. నిన్ను కూడా తీసుకువెళతా బండి ఎక్కు అన్నాడు.
సరే.. కాస్త ముఖ పరిచయం ఉన్న వ్యక్తే కదా అని బండి ఎక్కింది. కొంత దూరం బాగానే వెళ్లాడు. కానీ అంతలోనే వాడి మెదడులో ఏదో పురుగు తొలిచినట్టుంది. బండిని స్పీడుగా పోనిస్తూ కంకిపాడు వైపు కాకుండా గోసాల వైకుంఠపురం వైపు తీసుకెళుతున్నాడు. దీంతో అనుమానం వచ్చిన ఆ యువతి బండి ఆపామని కోరింది. అయినా వినిపించుకోకుండా అతడు మరింత వేగంగా పొలాల వైపు వెళ్తుండడంతో ఆమె గట్టిగా కేకలు వేస్తూ వాహనంపై నుంచి దూకేసింది. ఆమె కేకలు విన్న స్థానికులు పరుగున వచ్చి గాయాలపాలైన యువతిని ఆసుపత్రికి తరలించారు. రవీంద్రను పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బండిని స్వాధీనం చేసుకున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com