ఆలింగనాలు, సత్కారాలు.. ఇద్దరు సీఎంల అన్యోన్యత

ఆలింగనాలు, సత్కారాలు.. ఇద్దరు సీఎంల అన్యోన్యత

ఆంధ్రప్రదేశ్ పర్యటనలో బిజీబిజీగా గడిపారు తెలంగాణ సీఎం. విజయవాడ వెళ్తూనే కనకదుర్గ అమ్మవారిని సీఎం కేసీఆర్‌ దర్శించుకున్నారు. అటు నుంచి తాడేపల్లిలోని వైఎస్‌ జగన్‌ క్యాంప్‌ కార్యాలయానికి వెళ్లి.. కాళేశ్వరం ప్రారంభోత్సవానికి జగన్‌ను సాదరంగా ఆ‍హ్వానించారు. తరువాత కేసీఆర్‌, జగన్‌ కలిసి శ్రీ గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమానికి వెళ్లి శారదాపీఠం ఉత్తరాధికార దీక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఒక్కరోజు విజయవాడ పర్యటనలో బిజీబిజీగా కనిపించారు.. హైదరాబాద్‌ నుంచి నేరుగా గన్నవరం ఎయిర్‌పోర్టు చేరుకున్న కేసీఆర్‌కు ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్‌తో పాటు పలువురు నాయకులు ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారిని సీఎం కేసీఆర్‌ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వాదం ఇచ్చి తీర్థప్రసాదాలు అందజేశారు..

అమ్మవారిని దర్శించుకున్న తరువాత సీఎం కేసీఆర్‌.. జగన్‌ నివాసానికి వెళ్లారు. కేసీఆర్‌ను ముఖ్యమంత్రి జగన్‌ సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకువెళ్లారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని జగన్‌ను ఆహ్వానించారు కేసీఆర్. స్వయంగా ఆహ్వాన పత్రికను అందజేశారు. కేసీఆర్‌, కేటీఆర్‌ ను, జగన్‌ శాలువాలతో సత్కరించారు. వారికి జ్ఞాపికలను అందజేశారు. ఆ తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి భోజనం చేశారు.

విందు అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులు గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమానికి వెళ్లారు. విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి దీక్షా సన్యాస స్వీకరణ మహోత్సవంలో పాల్గొన్నారు. స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. ఉత్తరాధికారి సన్యాసాశ్రమ దీక్షా మహోత్సవ కార్యక్రమం పూర్తి అయ్యేవరకు ఇద్దరు సీఎంలు అక్కడే ఉన్నారు. తరువాత కేసీఆర్‌ తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నారు..

Tags

Read MoreRead Less
Next Story