బీజేపీలోకి 20 మంది టీడీపీ కీలక నేతలు..

బీజేపీలోకి 20 మంది  టీడీపీ కీలక నేతలు..

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అగ్రనేతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఏపీలోని పలువురు ముఖ్య నేతలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారు. మరి ఏపీలో కమలం వికసిస్తుందా? మారుతున్న సమీకరణాలు దేనికి సంకేతం? కమలం గూటికి నేతలు క్యూ కట్టడానికి కారణమేంటి? హస్తినలో ఏం జరుగుతోంది.?

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి కేవలం 23 ఎమ్మెల్యే, మూడు ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంది. 151 సీట్లను సొంతం చేసుకుని తిరుగులేని శక్తిగా వైసీపీ ఎదిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను అనుకూలంగా మలుచకుని బలోపేతం కావాలని కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆపరేషన్ ఆకర్శ్ చేపట్టారు.

టిడిపికి కీలక నేతలు BJPవైపు చూస్తున్నారు. ఇప్పటికే రాజ్యసభలోని నలుగురు ఎంపీలు తమను ప్రత్యేక వర్గంగా చూడాలంటూ వెంకయ్య నాయుడుకి లేఖ సమర్పించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో ఎంపీలు కమల తీర్థం పుచ్చుకున్నారు. వీరి బాటలోనే కొంతమంది ఎమ్మెల్యేలు, మాజీలు సైతం బిజెపిలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే కాపు సామాజిక వర్గ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. భవిష్యత్తు కార్యచరణపై చర్చించారు. ఇందులో మెజార్టీ నేతలు బీజేపీలో చేరేందుకు సిద్దమయ్యారని ఈ పార్టీ వర్గాలంటున్నాయి. మరో ముఖ్య సామాజికవర్గం నేతలు కూడా త్వరలోనే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 20 మందికి పైగానే కీలక టీడీపీ నాయకులు BJPకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ నాయకత్వం... ఏపీ నేతలతో సమావేశం ఏర్పాటు చేసింది. వలసవచ్చే నాయకుల లిస్టుతో పాటు.. వారి గత అనుభవం, వారికి ఇవ్వాల్సిన ప్రాధాన్యం, కమిట్మెంట్లు వంటి వాటి విషయంలో చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశానికి రాష్ట్ర ఇంఛార్జులుగా ఉన్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరన్, సునీల్ దియోధర్, జీవీఎల్, విష్ణువర్ధన్ సహా పలువురు నేతలు హాజరుకానున్నారు.

తెలంగాణలో కూడా భారీగా వలసలు ఉంటాయని బీజేపీ వర్గాలంటున్నాయి. ఇటు ఏపీలో కూడా బలోపేతం చేసేందుకు వ్యూహాలు చేస్తున్నారు బిజెపి అగ్రనేతలు. చేరేందుకు ఆసక్తి చూపుతున్న వారిని చేర్చుకునేందుకు బిజెపి కూడా సిద్దంగా ఉందని బాహటంగానే చెబుతోంది. మొత్తానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో ఉన్న సమయంలోనే రాష్ట్రంలో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి.

Tags

Next Story