చివరి మ్యాచ్‌లో మలింగకు నిరాశ.. భారత్‌కు అగ్రస్థానం

చివరి మ్యాచ్‌లో మలింగకు నిరాశ.. భారత్‌కు అగ్రస్థానం

ప్రపంచకప్‌లో భారత్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ ఎప్పుడో, ప్రత్యర్థి ఎవరో తేలిపోయింది. మంగళవారం టీమ్‌ఇండియా.. న్యూజిలాండ్‌తో సెమీస్‌ ఆడనుంది. టోర్నీ చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా.. దక్షిణాఫ్రికా చేతిలో ఓడి, పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి పరిమితమైంది. భారత్‌కు అగ్రస్థానం ఖరారవడంతో.. నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌తో సెమీస్‌ ఖరారైంది. ఆసీస్‌.. మూడో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్‌తో గురువారం సెమీఫైనల్లో తలపడుతుంది.ప్రపంచకప్‌ లీగ్‌ దశలో చివరి మ్యాచ్‌ను భారత్‌ విజయంతో ముగించింది. నామమాత్రమైన చివరి మ్యాచ్‌ను కూడా టీమిండియా వదల్లేదు. శనివారం హెడింగ్లీ మైదానంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

శ్రీలంక నిర్దేశించిన 265 పరుగుల లక్ష్యాన్ని కోహ్లి సేన 43.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. లక్ష్య ఛేదనలో టీమిండియా ఓపెనర్లు రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ సెంచరీలతో చెలరేగిపోయారు. ఓపెనర్లు శతకాలు సాధించడంతో టీమిండియా సులువుగా విజయాన్ని అందుకుంది.34 పరుగులతో విరాట్‌ కోహ్లి చివరి వరకు ఉండి జట్టుకు విజయాన్నందించాడు. లంక బౌలర్లలో ఉదాన, రజిత, మలింగలు తలో వికెట్‌ దక్కించుకున్నారు. శతకంతో టీమిండియాకు సులువుగా విజయాన్ని అందించిన రోహిత్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.

టీమిండియా హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ వరల్డ్‌కప్‌ చరిత్రలో అరుదైన ఘనత సాధించాడు. ఒకే టోర్నీలో ఐదు సెంచరీలు సాధించిన మొదటి క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు సంగక్కర పేరిట ఉంది. 2015 టోర్నీలో సంగా ఈ ఘనత సాధించాడు. ఈ టోర్నీలో మొదటి నుంచి అద్భుతంగా ఆడుతున్న రోహిత్‌... ఇప్పటికే పాకిస్తాన్‌, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, బంగ్లాదేశ్ పై నాలుగు సెంచరీలు సాధించాడు. శ్రీలంకపైనా అదే ఫామ్‌ కొనసాగించిన రోహిత్‌.. సెంచరీ నమోదు చేసి... వరల్డ్‌ కప్‌ రికార్డు బద్దలు కొట్టాడు.

ఇక ప్రపంచకప్‌ చివరి మ్యాచ్‌లో మలింగ పూర్తిగా తెలిపోయాడు. టీమిండియా బ్యాట్స్‌మెన్‌పై ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు.

తాజా విజయంతో పాయింట్లపట్టికలో భారత్‌ అగ్రస్థానంలో నిలిచింది. టోర్నీలో 9 మ్యాచ్‌లాడిన భారత్‌ 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో మాత్రమే ఓటమి చవిచూసింది. న్యూజిలాండ్‌తో జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా టాస్‌ పడకుండానే రద్దైంది. దీంతో భారత్‌ ప్రస్తుతం 15 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. దీంతో కోహ్లీసేన.. న్యూజిలాండ్‌తో సెమీస్‌ ఆడనుంది. టోర్నీ చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా.. దక్షిణాఫ్రికా చేతిలో ఓడి, పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి పరిమితమైంది. భారత్‌కు అగ్రస్థానం ఖరారవడంతో.. నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌తో సెమీస్‌ ఖరారైంది. ఆసీస్‌.. మూడో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్‌తో గురువారం సెమీఫైనల్లో తలపడుతుంది.

Tags

Read MoreRead Less
Next Story