ఇది ముందు చూపు లేని బడ్జెట్.. నిరుద్యోగభృతికి నిధులేవి

ఏపీ బడ్జెట్ పై అధికార పార్టీ ప్రశంసలు కురిపిస్తుంటే...విపక్ష పార్టీలు మాత్రం విమర్శలు కురిపిస్తున్నాయి. ఏపీ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేలా బడ్జెట్ ఉందని ఆరోపించారు నేతలు. వాస్తవాలకు కేటాయింపులకు పొంతన్న లేదన్న విపక్ష పార్టీ నేతలు..ప్రభుత్వానికి ముందుచూపు లేదంటూ విమర్శించారు.ఏపీ బడ్జెట్ అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల మంటలు రాజేస్తోంది. బ్రహ్మాండమైన బడ్జెట్ తీసుకొచ్చామని ప్రభుత్వం చెబుతుంటే విపక్ష పార్టీలు మాత్రం బడ్జెట్ లెక్కల్లో లొసుగులను హైలెట్ చేస్తూ కడిగిపారేస్తున్నాయి. ఎన్నికల హామీలకు కూడా ప్రాధాన్యం ఇవ్వలేదంటూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి.
బడ్జెట్ పై స్పందించిన విపక్ష నేత చంద్రబాబు నాయుడు..ఏ మాత్రం ముందు చూపు లేని బడ్జెట్ అని తేల్చిపారేశారు. మాటలకు, చేతలకు పొంతన లేదనేందుకు బడ్జెట్ కేటాయింపులే నిదర్శనమన్నారు. ప్రాజెక్టులకు కోతలు పెట్టి ప్రగతికి గండికొట్టారని మండిపడ్డారాయన. నిరుద్యోగభృతికి నిధులు లేవు..అమ్మ ఒడి పథకం కింద 43 లక్షల మంది తల్లులకే లబ్ధి చేకూరేలా కేటాయింపులు ఉన్నాయన్నారు. అలాగే ఆర్టీసీ విలీనం, డ్వాక్రా మహిళలకు 17 వందల కోట్లు మాత్రమే కేటాయించారని విమర్శించారు చంద్రబాబు.
ఏపీ బడ్జెట్‌లో ప్రచారం ఎక్కువ.. పస తక్కువ ఉందన్నారు మాజీ ఆర్థికమంత్రి యనమల విమర్శించారు. జగన్‌కు దశ ఉంది కాని.. దిశ లేదన్నారు. బడ్జెట్‌లో నేను ఉన్నాను.. నేను విన్నాను అని చెప్పే జగన్.. నేను తిన్నాను అని చెప్పుకుంటే కూడా బాగుటుందన్నారు. వడ్డీ లేని రుణాలపై హడావుడి చేసిన సీఎం.. కేవలం వంద కోట్ల రూపాయలే ఎలా కేటాయించారని ప్రశ్నించారు. అన్ని రంగాల్లో కేటాయింపుల్లో కోతలు పెట్టడాన్ని తప్పుబట్టారు యనమల. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తో యువత భవిష్యత్తు అంధకారంగా మారుతుందన్నారు మాజీ మంత్రి మాణిక్యాల వర ప్రసాద్.
జగన్ ప్రభుత్వం చెబుతున్నట్లుగా నవరత్నాల అమలు ఈ బడ్జెట్ వల్ల సాధ్యం కాదన్నారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్. యువతకు ఈ బడ్జెట్ అన్యాయం చేసిందని మండిపడ్డారు. ఖర్చులు చూపించిన ప్రభుత్వం ఆదాయమార్గాలను వివరించలేదని తప్పుబట్టారు. కీలక రంగాల కేటాయింపుల్లో కోతలు వేశారని విమర్శించారు. బడ్జెట్ లో కేటాయింపుల తీరును విపక్ష పార్టీలు ముక్తకంఠంతో తప్పుబట్టాయి. ప్రధాన రంగాలకు కూడా కేటాయింపులను తగ్గించటం ప్రగతికి చేటు తెచ్చే నిర్ణయమే అంటున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com