రాయలసీమకు నిరాశ

రాయలసీమకు నిరాశ
X

వరద జలాల రాకపై రాయలసీమలో నిరాశ నెలకొంది. ఎగువన మహారాష్ట్ర, కర్నాటకలో ఆశా జనకంగా వర్షాలు కురుస్తున్నా... దిగువన ఏపీలో మాత్రం నిరాశా జనకంగా ఉన్నాయి. దీంతో ఆలస్యంగానైనా కృష్ణమ్మ శ్రీశైలం మల్లన్న చెంతకు తరలి వస్తుంటే.. తుంగభద్రమ్మ రాక మాత్రం మరింత ఆలస్యం కానుంది.

ప్రతి ఏడాది జూన్‌లో ఎగువ రాష్ట్రాల్లో కుండపోతగా కురిసే వర్షాలతో ఆ వరద నీరంతా పెద్ద ఎత్తున దిగువకు పరవళ్లు తొక్కుకుంటూ ప్రవహించేది. మహారాష్ట్ర ఆల్మట్టి నారాయణ్ పూర్ మీదుగా జూరాలకు వచ్చే కృష్ణమ్మ.. అక్కడి నుంచి కర్నూలు జిల్లాలోలోని శ్రీశైలం ప్రాజెక్టుకు పరుగులు తీసేది. కర్నాటక ఎగువ ప్రాంతంలో కురిసే వర్షాలకు... 100 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల హెస్పేట తుంగభద్ర జలాశయం పూర్తిగా నిండిపోయి... తుంగభధ్ర పరవళ్లు తొక్కుతూ దిగువన శ్రీశైలం మల్లన్న చెంతకు ఉధృతంగా ప్రవహించేది. కానీ ఈ ఏడాది మాత్రం దిగువనా తీవ్ర వర్షాభావ పరిస్థితులు అలుముకున్నాయి.

జూన్‌లో కురవాల్సిన వర్షాలు జులై ఆఖరులో కురిసాయి. అదీ మహారాష్ట్రలో ఎక్కువగా కురిస్తే.. కర్నాటకలో మాత్రం ఓ మోస్తారుగా కురుస్తున్నాయి. కృష్ణ వాటర్.. నారాయణ్ పూర్ నుంచి లక్ష క్యూసెక్కుల దాకా తెలంగాణాలోని జూరాలకు చేరుకుంటున్నాయి. ఇక జూరాల నిండి అక్కడ గేట్లు ఎత్తితే ఆ నీరంతా నేరుగా శ్రీశైలం డ్యాంలోకి వచ్చి చేరనున్నాయి. సుమారు 2 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో జూరాలకు ప్రవహించే అవకాశం ఉండటంతో... శ్రీశైలం డ్యాంకి మరో మూడు రోజుల్లో భారీగా ఇన్ ఫ్లో ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Tags

Next Story