ఆంధ్రప్రదేశ్

గోదావరి ఉగ్రరూపం.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

గోదావరి ఉగ్రరూపం.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
X

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట వద్ద గోదావరి ఉరకలేస్తోంది. 13 లక్షల 80వేల క్యూసెక్కుల వరద బ్యారేజీకి వచ్చి చేరుతుండడంతో.. నీటిమట్టం 14 అడుగులకు చేరువవుతోంది. డెల్టా కాల్వలకు 7వేల 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన అధికారులు.. మిగతాదంతా సముద్రంలోకి వదిలేస్తున్నారు. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. పశ్చిమగోదావరి, ఖమ్మంలో వర్షాలు కాస్త తగ్గినా.. ఛత్తీస్‌గడ్ నుంచి వరదపోటు కారణంగా మరో 2 రోజులు గోదావరి మహోగ్రంగానే ప్రవహించే అవకాశాలున్నాయి. రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలో ముంపునగు గురైన లంక గ్రామాల ప్రజల్ని పునరావాస శిబిరాలకు తరలించారు. సముద్రంలో కలుస్తున్న వరదపోటు యానాంకి కూడా ఇబ్బందిగానే మారింది. యానాంలోని ఫెర్రీ రోడ్డు మునిగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

వరద ముంపు నేపథ్యంలో సహాయ చర్యల కోసం ఎన్టీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక బృందాలను ఎక్కడికక్కడ సిద్ధంగా ఉంచారు. మత్యకారులు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. కోస్తా తీరంలో గంటకు 55 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాగల 24 గంటల్లో ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతోంది. ఉత్తరకోస్తాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో.. 5.8 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కూడా ఉన్నందున.. ఈ ప్రభావంతో భారీవర్షాలు కురుస్తాయి.

విలీన మండలాల్లో 20 గ్రామాలు, దేవీపట్నం చుట్టుపక్కల మరో 32 గ్రామాలు 5 రోజులుగా నీళ్లలోనే ఉన్నాయి. పోలవరం వద్ద నీటి ఉధృతి తగ్గితే తప్ప.. మళ్లీ అక్కడ జనజీవనానికి సాధరణ పరిస్థితులు నెలకొనవు. వరద ప్రాంతాల్లో నిన్న మంత్రులు, అధికారులు పర్యటించి సహాయ చర్యలపై ఆరా తీసినా.. ఇప్పటికీ స్థానికులు ప్రభుత్వ యంత్రాంగం తీరుపై అసంతృప్తితోనే ఉన్నారు. కరెంటు లేక చీకట్లోనే మగ్గుతున్నామని, నిత్యావసరాలు, టార్పాలిన్లు వంటివి కొన్ని ప్రాంతాలకు సరఫరా చేయలేదని చెప్తున్నారు. భారీవర్షాలకు వాగులు, వంకలు కూడా పొంగిపొర్లుతుండడంతో.. ముంపు మరింత ఎక్కువగా ఉందంటున్నారు.

Next Story

RELATED STORIES